పెనుగొలనులో లోకం సుభిక్షంగా ఉండాలని నగర సంకీర్తన
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో లోకం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ శ్రీ సత్యసాయి సేవా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం నగర సంకీర్తన వైభవంగా నిర్వహించారు. శివాలయం ప్రాంగణంలోని షిరిడీ సాయిబాబా మందిరం నుంచి ప్రారంభమైన నగర సంకీర్తన రేడియో రూము, వాటర్ ట్యాంక్ రోడ్డు, బస్టాండ్, బొడ్రాయి సెంటర్, రామాలయం మీదుగా కొనసాగింది. ఈ సందర్భంగా భక్తులు ‘ఓం సాయి, శ్రీ సాయి, జయజయ సాయి’, ‘శ్రీరామ, జయరామ, జయజయ రామ’ నామాలను భక్తిశ్రద్ధలతో సంకీర్తించారు. గ్రామ ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని, లోకమంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సాయిబాబా కమిటీ సభ్యులు డాక్టర్ జి. నరసింహారావు, సుగ్గల హనుమంతరావు, పారేపల్లి కృష్ణారావు, పాశం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. పెనుగొలనులో భక్తిశ్రద్ధలతో హనుమాన్ చాలీసా పారాయణం ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలోని బొడ్రాయి సెంటర్ వద్ద ఉన్న అభయాంజనేయ స్వామి ఏకశిల విగ్రహం వద్ద శనివారం రాత్రి భక్త బృందం ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా పారాయణం, భజన కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు హనుమాన్ చాలీసా పారాయణం చేసి, భజనలతో స్వామివారిని స్మరించుకున్నారు. అనంతరం స్వామివారికి వివిధ రకాల ప్రసాదాలను నివేదించి, భక్తులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి బొలగాని నాగయ్య, కోట దాసు, పసుమర్తి లక్ష్మణరావు తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.