నారాయణపురం మండలానికి కరువు ప్రాంతంగా ప్రకటించాలి
డిండి, శివన్నగూడెం ప్రాజెక్టుల ద్వారా నారాయణపురం మండలానికి సాగునీరు అందించాలి
నారాయణపురం మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి.. ఎండిన పంటలకు ఎకరాకు రూ.30 వేల పరిహారం ఇవ్వాలి
యాదాద్రి భువనగిరి: ఏదుల నుంచి డిండి ప్రాజెక్టుకు నీటిని తరలించి, శివన్నగూడెం ప్రాజెక్టును పూర్తి చేయడంతో పాటు రాచకొండ ఎత్తిపోతల పథకానికి డీపీఆర్ ఆమోదించి నిధులు విడుదల చేయాలని సీపీఎం సంస్థాన్ నారాయణపురం మండల కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించి, నారాయణపురం మండలానికి వెంటనే సాగునీరు అందించాలని కోరుతూ తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా సీపీఎం నాయకులు మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గంలోని నారాయణపురం మండలం ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతమని, ఇక్కడి ప్రజలకు ఇప్పటికీ సాగునీరు అందకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు ఏదుల నుంచి డిండి ప్రాజెక్టు, శివన్నగూడెం ప్రాజెక్టుల ద్వారా ఈ ప్రాంతానికి సాగునీరు అందించే లక్ష్యంతో నిర్ణయాలు తీసుకున్నాయని తెలిపారు. శివన్నగూడెం ప్రాజెక్టు పనులు కొంతవరకు పూర్తయినప్పటికీ, మిగిలిన పనులను వేగవంతం చేసి ప్రాజెక్టును పూర్తిచేయాల్సిన అవసరం ఉందన్నారు.
రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించిన విధంగా ఏదుల నుంచి డిండికి నీటిని తరలించి, అక్కడి నుంచి మునుగోడు ప్రాంతానికి సాగునీరు అందించే ప్రక్రియను కొనసాగించాలని కోరారు. శివన్నగూడెం ప్రాజెక్టును పూర్తిచేయడంతో పాటు రాచకొండ ఎత్తిపోతల పథకానికి డీపీఆర్ ఆమోదించి, అవసరమైన నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్టుల విషయంలో కొన్ని వర్గాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయనే ఆందోళనను నాయకులు ప్రస్తావిస్తూ, వాటి వల్ల నారాయణపురం ప్రాంత రైతులకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
నారాయణపురం మండలంలో గత ఐదేళ్లలో నాలుగేళ్లు కరువు పరిస్థితులు నెలకొన్నాయని నాయకులు తెలిపారు. సాగునీరు లేక పంటలు సరిగా పండకపోవడంతో రైతులు పెట్టుబడులు కోల్పోతున్నారని, జీవనోపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోందన్నారు. ఈ ఏడాది కూడా వర్షాభావంతో వరి, పత్తి పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు.
ప్రభుత్వం వెంటనే నారాయణపురం మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని, ఎండిపోయిన ప్రతి ఎకరానికి రూ.30 వేల చొప్పున నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పనులను వెంటనే ప్రారంభించి కూలీలకు ఉపాధి కల్పించాలని కోరారు. సాగునీటి ప్రాజెక్టుల పనులను వేగవంతం చేసి, రైతుల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు గుంటోజు శ్రీనివాసచారి, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు దోనూరు నర్సిరెడ్డి, సీపీఎం సీనియర్ నాయకులు సురుకంటి శ్రీనివాసరెడ్డి, దొంతగోని పెద్దులు, తుమ్మల నర్సిరెడ్డి, మండల కార్యదర్శివర్గ సభ్యుడు చింతకాయల నరసింహ, మండల కమిటీ సభ్యులు శివశక్తి లాలయ్య, దవుల జంగయ్య, సురవి కృష్ణమూర్తి, గుండు జంగయ్య, పీఎన్‌ఎం జిల్లా ఉపాధ్యక్షుడు గుండు నరసింహ, పిట్ట గాలయ్య, నెల్లికంటి మల్లేష్, కొమ్ము మల్లేశం, సురివి కిరణ్, గంగాదేవి, బిక్షపతి, గుండు లింగస్వామి, బొమ్మగాని శంకరయ్య, ఉడుత గాలయ్య, దొంతగాని శంకరయ్య, వంకర్ల యాదయ్య, గాజుల అంజయ్య, బద్దం నరసింహారెడ్డి, మర్రి జంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.