ఆకాశంలో మెరిసేవన్నీ నక్షత్రాలు కావు..
భూమి చుట్టూ 31 వేలకుపైగా ఉపగ్రహాలు!
భూమి సమీప కక్ష్యలో పెరుగుతున్న రద్దీ.. ఉపగ్రహాల ఢీకొనడంతో అంతరిక్ష శకలాల ముప్పు
మెరిసేదంతా బంగారం కాదన్నట్లు.. ఆకాశంలో మెరిసేవన్నీ నక్షత్రాలు కావు. రాత్రివేళ ఆకాశంలో కదులుతూ కనిపించే కాంతుల్లో కృత్రిమ ఉపగ్రహాలు కూడా ఉండొచ్చు. ప్రస్తుతం భూమి చుట్టూ 31 వేలకుపైగా ఉపగ్రహాలు పరిభ్రమిస్తున్నాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. వీటిలో ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ సంస్థ నిర్వహిస్తున్న స్టార్‌లింక్ ఉపగ్రహాల సంఖ్య దాదాపు 10 వేలకు చేరినట్లు పేర్కొన్నారు.
ఉపగ్రహాల సంఖ్య వేగంగా పెరుగుతుండటంతో భూమికి సమీపంలోని కక్ష్యల్లో రద్దీ పెరుగుతోంది. సమాచార వ్యవస్థలు, ఇంటర్నెట్ సేవలు, వాతావరణ పరిశీలన, భూమి పర్యవేక్షణ వంటి అనేక అవసరాలకు ఉపగ్రహాలు కీలకంగా మారాయి. అయితే వాటి సంఖ్య పెరగడం వల్ల అంతరిక్ష నిర్వహణలో కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి.
ఉపగ్రహాలు ఒకదానికొకటి ఢీకొంటే భారీ సంఖ్యలో శకలాలు ఏర్పడే ప్రమాదం ఉంది. ఈ శకలాలు ఇతర ఉపగ్రహాలకు నష్టం కలిగించడంతోపాటు అంతరిక్ష కార్యకలాపాలకు ఆటంకం కలిగించవచ్చు. కక్ష్యల్లో రద్దీ పెరిగే కొద్దీ ఢీకొనే ప్రమాదాన్ని అంచనా వేయడం, ఉపగ్రహాల కదలికలను పర్యవేక్షించడం మరింత కీలకమవుతోంది.
ఈ నేపథ్యంలో ఉపగ్రహాల ప్రయోగాలు, కక్ష్యల నిర్వహణ, కాలపరిమితి ముగిసిన ఉపగ్రహాలను సురక్షితంగా తొలగించడం వంటి అంశాలపై అంతర్జాతీయ స్థాయిలో సమన్వయం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. తగిన నియంత్రణ చర్యలు తీసుకోకపోతే అంతరిక్ష శకలాల సమస్య భవిష్యత్తులో మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది.