పుంగనూరులో బీఎస్పీ నామినేషన్లకు అడ్డంకులు
- కూటమి నాయకుల తీరుపై పార్టీ ఆగ్రహం
- నామినేషన్ పత్రాలు చించివేశారని, మహిళలపై దాడులు చేశారని బీఎస్పీ నేతల ఆరోపణలు
పుంగనూరు: పుంగనూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయకుండా కూటమి నాయకులు అడ్డుకున్నారని బీఎస్పీ నేతలు ఆరోపించారు. నామినేషన్లు వేసేందుకు మూడు రోజులుగా ప్రయత్నిస్తున్న పార్టీ నాయకులు, కార్యకర్తలను అడ్డుకోవడంతో పాటు నామినేషన్ పత్రాలను చించివేశారని, మహిళలపై దౌర్జన్యానికి పాల్పడ్డారని వారు ఆరోపిస్తూ నిరసన వ్యక్తం చేశారు.
భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకుని, బహుజనులకు రాజ్యాధికారం సాధించాలనే లక్ష్యంతో తమ పార్టీ అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేసేందుకు ముందుకు వచ్చారని బీఎస్పీ నాయకులు తెలిపారు. అయితే నామినేషన్లు దాఖలు చేసే ప్రక్రియలో అడ్డంకులు సృష్టించడం ప్రజాస్వామ్య హక్కులను హరించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు బందెల గౌతమ్ కుమార్ పుంగనూరుకు వచ్చేందుకు ప్రయత్నించగా, మదనపల్లెలో ఆయనను గృహనిర్బంధం చేసి అడ్డుకున్నారని పార్టీ నాయకులు ఆరోపించారు. ఈ చర్యను వారు తీవ్రంగా ఖండించారు.
ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల్లో పాల్గొనే హక్కును కాపాడాలని, నామినేషన్ల ప్రక్రియలో ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలని బీఎస్పీ నేతలు డిమాండ్ చేశారు. తమ పార్టీ అభ్యర్థులను అడ్డుకున్న ఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, భవిష్యత్తులో కూటమి ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
ఈ నిరసన కార్యక్రమంలో పుంగనూరు నియోజకవర్గ ఇన్చార్జి సురేష్, అంజప్ప, బాలసుబ్రమణ్యం, చుక్కమ్మ, నాగప్ప, రమణ, జేవీ నాగరాజ్, వసంత, రెడ్డమ్మ, గీతమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా “జై బీఎస్పీ.. జై భీమ్” అంటూ నినాదాలు చేశారు.