పెనుగొలను: ఘనంగా కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ జయంతి వేడుకలు
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలోని ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో గురువారం కవి సామ్రాట్, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ 131వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సభలో పలువురు వక్తలు మాట్లాడుతూ.. విశ్వనాథ సత్యనారాయణ 1895 సెప్టెంబర్ 10న కృష్ణా జిల్లా నందమూరు గ్రామంలో జన్మించారని తెలిపారు. తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. 25కు పైగా కావ్యాలు, ఆరు శతకాలు, 13 గేయ కావ్యాలు, 15 నాటకాలు, 58 నవలలు, పది సంస్కృత నాటకాలు, పది విమర్శనా గ్రంథాలతో పాటు వందలాది వ్యాసాలు, ఇతర రచనలు చేసిన మహాకవిగా విశ్వనాథ సత్యనారాయణకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు.
ఆయన రచనల్లో రామాయణ కల్పవృక్షం, శ్రీమద్రామాయణ కల్పవృక్షం, ఆంధ్ర ప్రశస్తి వంటి కావ్యాలు, వేయి పడగలు, ఏకవీర, చెలియలికట్ట వంటి నవలలు, నర్తనశాల నాటకం, విశ్వనాథ మధ్యాక్కరలు శతకం తదితర రచనలు విశేష ఆదరణ పొందాయని వివరించారు.
విశ్వనాథ సత్యనారాయణ సాహిత్య సేవలకు గుర్తింపుగా 1970లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రదానం చేసిందని, 1971లో తెలుగు సాహిత్యంలో తొలి జ్ఞానపీఠ పురస్కారం ఆయనకు లభించిందని తెలిపారు. 20వ శతాబ్దంలో ఆంధ్ర సాహిత్యానికి, ముఖ్యంగా సంప్రదాయ సాహిత్యానికి విశ్వనాథ సత్యనారాయణ పెద్దదిక్కుగా నిలిచారని పేర్కొన్నారు. ఆయన 1976 అక్టోబర్ 18న కన్నుమూశారని వివరించారు.
ఈ సందర్భంగా సాయిబాబా సేవా కమిటీ సభ్యులు పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న విద్యార్థులకు నోటు పుస్తకాలు, రంగు పెన్సిళ్లు అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కొర్రపాటి యోహను, విశ్రాంత ప్రిన్సిపాల్ వెదురు వెంకటరెడ్డి, సాయిబాబా సేవా కమిటీ అధ్యక్షుడు వూటుకూరు నారాయణరావు, సీఆర్‌పీ సంగెపు చిన్న నరసింహారావు, ఉపాధ్యాయులు కె. సుజాత, డి. బేబీ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
పెనుగొలను గ్రంథాలయంలోనూ నివాళులు
పెనుగొలను గ్రామ గ్రంథాలయంలో కూడా కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ జయంతి వేడుకలను నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గ్రంథాలయ అధికారి తెనాలి వెంకటేశ్వర్లు విశ్వనాథ సత్యనారాయణ సాహిత్య రచనలు, తెలుగు భాషకు ఆయన అందించిన సేవలను వివరించారు. కార్యక్రమంలో గ్రామస్తులు, గ్రంథాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.