పెనుగొలనులో శ్రీ రాజరాజేశ్వరి దేవిగా దర్శనమిచ్చిన పార్వతీ దేవి
వైభవంగా దసరా ఉత్సవాల ముగింపు.. సాయిబాబా విగ్రహ ప్రతిష్ఠ 26వ వార్షికోత్సవం
ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు నియోజకవర్గం, గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలోని శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో దసరా ఉత్సవాల్లో భాగంగా పదో రోజు మంగళవారం శ్రీ పార్వతీ దేవికి శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకరణ చేశారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి నిర్వహించిన పూజల్లో భక్తులు పాల్గొని దర్శించుకున్నారు.
ఆలయ అర్చకులు దాములూరి సత్యనారాయణ శర్మ, వేద పండితులు ఇంద్రగంటి సుబ్రహ్మణ్య శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి కుంకుమ పూజలు, రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అనంతరం చండీ హోమం, శమీ పూజ, స్వామివారి కల్యాణాన్ని వైభవంగా జరిపించారు. చిట్లూరి హేమచంద్ర ప్రసాద్ గుప్తా, చంద్రిక దంపతుల సహకారంతో భక్తులకు అన్నదానం ఏర్పాటు చేసినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.
శిరిడీ సాయిబాబా విగ్రహ ప్రతిష్ఠ 26వ వార్షికోత్సవం
ఆలయ ప్రాంగణంలోని శిరిడీ సాయిబాబా మూలవిరాట్‌కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సాయిబాబా వెండి విగ్రహానికి భక్తుల భాగస్వామ్యంతో అన్నాభిషేకం వైభవంగా జరిపించారు. భక్తులు భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
పది రోజులపాటు వివిధ రూపాల్లో సహకరించి దసరా ఉత్సవాలను విజయవంతం చేసిన భక్తులు, దాతలు, గ్రామస్థులకు ఆలయ కమిటీ నిర్వాహకులు వూటుకూరు నారాయణరావు కృతజ్ఞతలు తెలిపారు.