గురుకుల టెండర్లలో కమీషన్ల పంచాయితీ.. సీఎంవోపై మంత్రుల గుర్రు!
రూ.2,000 కోట్ల టెండర్లలో అవకతవకలు జరిగాయంటూ ఆరోపణలు.. తమను పక్కన పెట్టారంటూ సంక్షేమశాఖల మంత్రుల అసంతృప్తి
హైదరాబాద్: తెలంగాణలో గురుకుల విద్యాసంస్థలకు అవసరమైన సరుకుల కొనుగోలు టెండర్ల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. సుమారు రూ.2,000 కోట్ల విలువైన టెండర్లలో అవకతవకలు జరిగాయంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. టెండర్ల ప్రక్రియలో తమను పక్కన పెట్టి, సీఎంవో జోక్యం చేసుకుందంటూ సంక్షేమశాఖలకు చెందిన మంత్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
గురుకుల విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు, స్టేషనరీ కొనుగోలుకు సుమారు రూ.1,200 కోట్లు, కిరాణా సరుకుల సరఫరాకు రూ.800 కోట్ల విలువైన వర్క్ ఆర్డర్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ టెండర్లను అధిక ధరలకు గుజరాత్కు చెందిన కంపెనీలకు, కొందరు అనుయాయులకు కట్టబెట్టారంటూ ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంలో సీఎంవోకు చెందిన ఉన్నతాధికారి కీలక పాత్ర పోషించారనే చర్చ కూడా సాగుతోంది.
వర్క్ ఆర్డర్లు జారీ చేసి రెండు నెలలు గడిచినా సరుకుల సరఫరా పూర్తిస్థాయిలో జరగలేదని విమర్శలు వస్తున్నాయి. మరోవైపు విద్యార్థులకు అందిస్తున్న యూనిఫామ్లు, బూట్లు, సాక్సుల నాణ్యతపైనా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కుట్టుమిషన్లు, ఉపాధి శిక్షణకు సంబంధించిన టెండర్ల విషయంలోనూ వివాదం నెలకొన్నట్లు ప్రచారం జరుగుతోంది.
శాఖల పరిధిలోని వ్యవహారాల్లో సీఎంవో జోక్యం పెరుగుతోందన్న అసంతృప్తి మంత్రుల్లో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. టెండర్ల ప్రక్రియలో పారదర్శకత, సరుకుల నాణ్యత, సరఫరాలో జాప్యంపై తలెత్తిన ఆరోపణల నేపథ్యంలో ఈ వ్యవహారం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.