పోలవరం ఎంపీటీసీ టీడీపీ అభ్యర్థిగా చల్లగుళ్ళ రాజ్యలక్ష్మి నామినేషన్ భారీ ర్యాలీతో అట్టహాసంగా నామినేషన్ దాఖలు
ఏలూరు జిల్లా, నూజివీడు నియోజకవర్గం, చాట్రాయి మండలం పోలవరం ఎంపీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా చల్లగుళ్ళ రాజ్యలక్ష్మి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలిరావడంతో పోలవరం గ్రామంలో సందడి నెలకొంది. భారీ ర్యాలీతో అట్టహాసంగా సాగిన నామినేషన్ కార్యక్రమం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది. పార్టీ జెండాలు, కార్యకర్తల నినాదాల మధ్య ర్యాలీ ఉత్సాహంగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మరిడి చిట్టిబాబు, యర్రా ప్రసాదరావు, బిలుగుది జయరాజు తదితరులు పాల్గొని అభ్యర్థికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకుడు మరిడి చిట్టిబాబు మాట్లాడుతూ.. పోలవరం ఎంపీటీసీ స్థానంలో తెలుగుదేశం పార్టీ విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులన్నీ సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ ప్రజల మద్దతుతో ముందుకు సాగుతామని తెలిపారు. పార్టీ అభ్యర్థి చల్లగుళ్ళ రాజ్యలక్ష్మిని గెలిపించేందుకు నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరువ కావాలని పేర్కొన్నారు. భారీ ర్యాలీతో నిర్వహించిన నామినేషన్ కార్యక్రమం టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది.