పోలవరంలో టీడీపీ అభ్యర్థి రాజ్యలక్ష్మికి మద్దతుగా ఇంటింటి ప్రచారం కూటమి ప్రభుత్వ అభివృద్ధిని చూసి గెలిపించండి: టీడీపీ నేత మరిడి చిట్టిబాబు
చాట్రాయి: ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పోలవరం గ్రామంలో ఎంపీటీసీ స్థానానికి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్న చల్లగుళ్ళ రాజ్యలక్ష్మిని గెలిపించాలని కోరుతూ టీడీపీ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. టీడీపీ మండల పార్టీ మాజీ అధ్యక్షుడు మరిడి చిట్టిబాబు, పీఏసీఎస్ చైర్‌పర్సన్ యర్రా ప్రసాద్ రావు, టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షుడు బిలుగుది జయరాజు ఆధ్వర్యంలో గ్రామంలోని ఇళ్లకు వెళ్లి ప్రజలను కలుసుకున్నారు. ఈ సందర్భంగా మరిడి చిట్టిబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను, ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను గమనించి ఎంపీటీసీ అభ్యర్థి చల్లగుళ్ళ రాజ్యలక్ష్మికి మద్దతుగా నిలవాలని కోరారు. గ్రామ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, స్థానిక సమస్యల పరిష్కారానికి ప్రజాప్రతినిధుల సహకారం అవసరమని పేర్కొన్నారు. గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు మరింత ముందుకు సాగాలంటే రాజ్యలక్ష్మిని గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఇంటింటి ప్రచారంలో భాగంగా ప్రజలతో మాట్లాడి తమ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని టీడీపీ నాయకులు కోరారు.