పర్వతాపురం అంకమ్మ ఆలయంలో సరస్వతీ దేవి అలంకరణలో అమ్మవారి దర్శనం
ఆలయంలో అక్షరాభ్యాసాలు, కుంకుమ పూజలు ఏలూరు జిల్లా, నూజివీడు నియోజకవర్గం, చాట్రాయి మండలం పర్వతాపురం గ్రామంలో కొలువై ఉన్న అంకమ్మ దేవాలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజు మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారు సరస్వతీ దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. విద్యకు అధిదేవత అయిన సరస్వతీ దేవి అలంకరణలో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహించగా, పలువురు భక్తులు కుంకుమ పూజలు చేసి అమ్మవారిని భక్తితో పూజించారు. తమ పిల్లలకు విద్యాబుద్ధులు ప్రసాదించాలని, కుటుంబాలు సుఖసంతోషాలతో ఉండాలని భక్తులు అమ్మవారిని ప్రార్థించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ మిద్దె శివాజీ మాట్లాడుతూ, మూలా నక్షత్రం రోజున సరస్వతీ దేవిని దర్శించుకోవడం, చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించడం ఎంతో విశిష్టమైనదని పేర్కొన్నారు. విద్యార్థులు విద్యలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, గ్రామ ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరియడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేశారు.