మునగపాక పీహెచ్సీలో మాత్రలు ముక్కలుగా మారాయంటూ రోగి ఆందోళన
గడువు 2027 డిసెంబర్ వరకు ఉన్నా.. మాత్రల పరిస్థితిపై అనుమానాలు
మునగపాక: మునగపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు అందజేస్తున్న కొన్ని మాత్రల పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది. బీపీ సమస్యతో బాధపడుతున్న ఓ రోగికి వారం రోజుల క్రితం ఆసుపత్రి సిబ్బంది మాత్రల స్ట్రిప్ అందజేశారు. ఇంటికి వెళ్లి కవర్ తెరిచి చూడగా మాత్రలు ముక్కలుగా మారి కనిపించాయని ఆ రోగి తెలిపాడు.
మాత్రల గడువు 2027 డిసెంబర్ వరకు ఉన్నప్పటికీ, అవి ముక్కలుగా మారి ఉండటాన్ని చూసి వాటిని వేసుకోవడానికి రోగి భయపడినట్లు తెలిసింది. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు వైద్య సిబ్బంది పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు అందజేస్తుంటారు. అయితే, మందుల పరిస్థితి ఇలా ఉంటే వాటి నాణ్యత, నిల్వ విధానంపై సందేహాలు తలెత్తుతున్నాయి. ఇలాంటి మాత్రలను వినియోగించాలా వద్దా అన్న ఆందోళనతో కొందరు వాటిని వేసుకోవడం మానేస్తున్నట్లు సమాచారం.
ఈ విషయంపై వైద్యాధికారులు, సిబ్బందిని వివరణ కోరగా, ప్రభుత్వం నుంచి సరఫరా అయిన మందులనే రోగులకు అందజేస్తున్నామని వారు తెలిపినట్లు సమాచారం. మందుల సరఫరా, నిల్వ విధానం, మాత్రలు ముక్కలుగా మారడానికి గల కారణాలపై సంబంధిత అధికారులు పరిశీలించి స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది.