పుంగనూరు దాడులకు పెద్దిరెడ్డి కుటుంబమే బాధ్యత వహించాలి: బోడె రామచంద్రయాదవ్
స్థానిక ఎన్నికలు పూర్తయ్యే వరకు పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డిలను జైల్లో పెట్టాలి
పుంగనూరు: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పుంగనూరు నియోజకవర్గంలో చోటుచేసుకున్న దాడులు దురదృష్టకరమని భారత చైతన్య యువజన (బీసీవై) పార్టీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు బోడె రామచంద్రయాదవ్ అన్నారు. ఈ ఘటనలకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు మిథున్ రెడ్డిలే బాధ్యత వహించాలని ఆరోపించారు.
పుంగనూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దాడుల వెనుక మిథున్ రెడ్డి కుట్ర ఉందని, ఈ వ్యవహారానికి తాను ప్రత్యక్ష సాక్షినని పేర్కొన్నారు. పుంగనూరులో గత రెండు దశాబ్దాలుగా పెద్దిరెడ్డి కుటుంబం రౌడీయిజం, భూదందాలు, హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తోందని విమర్శించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందని బోడె రామచంద్రయాదవ్ ఆరోపించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటనలపైనా విమర్శలు చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయ్యే వరకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డిలను జైల్లో ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ పక్షపాతం లేకుండా వ్యవహరించి, ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా శాంతిభద్రతల పరిరక్షణకు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.