రైతన్నల కోసం జరిగే నీటి పోరాటాలకు ప్రజలు మద్దతివ్వాలి - గుజ్జ ఉప సర్పంచ్ ఎలిజాల శ్రీను
- రాచకొండ ఇరిగేషన్ నిర్మించి ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలి
- దశాబ్దాలు గడుస్తున్నా మునుగోడు ప్రాంతానికి నీళ్లేవీ?
NTODAY NEWS ; నల్గొండ
నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో సాగునీటి వనరులు లేకపోవడం పెద్ద లోటుగా మారిందని, రైతులు పంటలు పండించాలంటే వర్షాలపైనే ఆధారపడాల్సిన దుస్థితి నెలకొందని బిజెపి నాయకులు గుజ్జ గ్రామ ఉప సర్పంచ్ ఎలిజాల శ్రీను అన్నారు. నల్గొండ జిల్లాలోని మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే మునుగోడు నియోజకవర్గంలో చర్లగూడెం రిజర్వాయర్, కిష్టంపల్లి రిజర్వాయర్ మరియు శివన్నగూడెం రిజర్వాయర్ పనులు ఇంకా పూర్తి కాకపోవడం దారుణమన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నా, ఈ ప్రాంతానికి మాత్రం నీళ్లు లేకపోవడంతో దారుణమైన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడి రైతుల దశాబ్దాల కలను సాకారం చేయాలంటే, ఎండిన భూములకు జీవం పోసేందుకు ఏదుల ప్రాజెక్టు నుండి శివన్నగూడెం రిజర్వాయర్ కు నీటిని తరలించే నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు మారుతున్నా, ఎమ్మెల్యేలు మారుతున్నా ప్రాజెక్టులు మాత్రం పూర్తి కావడం లేదని,* ఎన్నికలప్పుడు హామీలే తప్ప ఈ ప్రాంతానికి నీళ్లు రావడం లేదని విమర్శించారు. ఫ్లోరైడ్ రహిత ప్రాంతంగా మార్చడానికి, కృష్ణమ్మ మంచినీళ్లతో ప్రతి ఇంటి దాహార్తిని తీర్చడంలో ఇక్కడి ఎమ్మెల్యేలు విఫలమయ్యారని అన్నారు. పచ్చని పొలాలతో కళకళలాడాల్సిన రాచకొండ ప్రాంతం కృష్ణమ్మ జలాలు లేక బీడు భూములుగా మారే ప్రమాదం ఉందన్నారు. శివన్నగూడెం ప్రాజెక్టును నిర్మించి, దీని ద్వారా రాచకొండలో లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మిస్తే వేలాది ఎకరాలకు సాగునీరు అందడమే కాకుండా, మునుగోడు నియోజకవర్గంలో ఫ్లోరైడ్ నీటి సమస్య మరియు తాగునీటి ఎద్దడి తీరుతుందని తెలిపారు. దశాబ్దాలుగా నత్తనడకన సాగుతున్న ప్రాజెక్టు పనులపై స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కోరారు. రైతన్నల కోసం జరిగే నీటి పోరాటాలకు ప్రజలందరూ మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బొద్దుల సాంబశివ, సిలువేరు సతీష్, శ్రీపతి సమర సింహా రెడ్డి, సిలువేరు శివ తదితరులు పాల్గొన్నారు.