డిసెంబర్ నుంచి ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తుల ధరల పెంపు
పెరిగిన ధరలతో సతమతమవుతున్న ప్రజలకు మరో భారం.. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగే అవకాశం
డిసెంబర్ నుంచి ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తుల ధరల పెంపు! సామాన్యులపై మరోసారి ధరల భారం.. ఆహార పదార్థాలు, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల ధరలు పెరిగే అవకాశం నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు మరో భారం పడే అవకాశం కనిపిస్తోంది. ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు డిసెంబర్ నుంచి తమ ఉత్పత్తుల ధరలను మరోసారి పెంచేందుకు యోచిస్తున్నట్లు సమాచారం. జూలై నుంచి సెప్టెంబర్ మధ్య ముడి సరుకుల ధరలు, ఉత్పత్తి వ్యయాలు పెరగడంతో కంపెనీలపై ఆర్థిక భారం అధికమైనట్లు తెలుస్తోంది. దసరా, దీపావళి పండుగల సమయంలో వినియోగదారుల కొనుగోళ్లపై ప్రభావం పడకుండా ధరల పెంపును వాయిదా వేసిన కంపెనీలు, పండుగల సీజన్ ముగిసిన తర్వాత ధరలను సవరించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ ధరల పెంపు అమల్లోకి వస్తే ఆహార పదార్థాలు, పానీయాలు, వ్యక్తిగత సంరక్షణ వస్తువులు, గృహ వినియోగ ఉత్పత్తులు, పరిశుభ్రతకు సంబంధించిన వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంది. దీంతో బిస్కెట్లు, ప్యాకేజ్డ్ ఆహార పదార్థాలు, సబ్బులు, షాంపూలు సహా రోజువారీ వినియోగ వస్తువుల కొనుగోలుకు వినియోగదారులు మరింత ఖర్చు చేయాల్సి రావచ్చు. ఇప్పటికే పెరిగిన నిత్యావసర ధరలతో కుటుంబ బడ్జెట్లు తారుమారవుతున్న నేపథ్యంలో మరోసారి ధరలు పెరిగితే సామాన్య, మధ్యతరగతి ప్రజలపై అదనపు ఆర్థిక భారం పడనుంది. అయితే ఏయే ఉత్పత్తుల ధరలను ఎంత మేరకు పెంచుతారు, ధరల పెంపు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనే అంశాలపై కంపెనీల నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.