కనిగిరి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా పులి శాంతి నామినేషన్
నామినేషన్ కార్యక్రమానికి హాజరైన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, బూచేపల్లి వెంకాయమ్మ, దద్దాల నారాయణ యాదవ్ తదితర నాయకులు
కనిగిరి: కనిగిరి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా వైఎస్సార్సీపీ తరఫున పులి శాంతి శనివారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
నామినేషన్ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, మాజీ జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, కనిగిరి నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జి దద్దాల నారాయణ యాదవ్, ఒంగోలు పార్లమెంట్ పార్టీ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, నియోజకవర్గ పరిశీలకుడు కసుకుర్తి ఆదేన్న, పార్టీ సీనియర్ నాయకులు చింతలచెరువు సత్యనారాయణ రెడ్డి, వై.ఎం. ప్రసాద్ రెడ్డి తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ముందుగా పులివెంకటరెడ్డి వీధిలోని పులి శాంతి నివాసం నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి ర్యాలీగా బయలుదేరి ఎంఎస్ఆర్ రోడ్డు మీదుగా మున్సిపాలిటీ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం పులి శాంతి తన నామినేషన్ దాఖలు చేశారు.
ఈ సందర్భంగా కనిగిరి నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జి దద్దాల నారాయణ యాదవ్ మాట్లాడుతూ, కనిగిరి మున్సిపాలిటీలో చైర్మన్ పదవితో పాటు 32 వార్డుల్లో పార్టీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో ప్రతి ఇంటికీ వెళ్లి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రజలకు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించాలని అన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై ప్రజలకు వివరించి, కనిగిరి మున్సిపాలిటీలో పార్టీ జెండా ఎగురవేసేందుకు కృషి చేయాలని కోరారు.
నామినేషన్ అనంతరం పులి శాంతి మాట్లాడుతూ, కనిగిరి మున్సిపాలిటీ ప్రజలు తనను ఆదరించి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గతంలో ఐదేళ్ల పాటు మున్సిపల్ వైస్ చైర్మన్గా పనిచేసిన అనుభవం తనకు ఉందని తెలిపారు. మరోసారి ప్రజలు అవకాశం కల్పిస్తే మున్సిపల్ చైర్మన్గా కనిగిరిని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తానన్నారు. దద్దాల నారాయణ యాదవ్ సహకారంతో ముందుకు సాగుతానని పేర్కొన్నారు.
తనకు అవకాశం కల్పించిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, ఒంగోలు పార్లమెంట్ ఇన్ఛార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కనిగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి దద్దాల నారాయణ యాదవ్తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలకు పులి శాంతి కృతజ్ఞతలు తెలిపారు. నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పార్టీ శ్రేణులకు ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పార్టీ మాజీ ప్రజాప్రతినిధులు, మండల పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ, వార్డు స్థాయి నాయకులు, వివిధ అనుబంధ విభాగాల సభ్యులు, కార్యకర్తలు, మహిళలు, పార్టీ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.