ఏపీకి వర్ష హెచ్చరిక.. 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
ఏపీకి వర్ష హెచ్చరిక.. 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ పిడుగులు, ఈదురుగాలులతో అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచన
ఆంధ్రప్రదేశ్లో రాబోయే మూడు గంటల్లో పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అల్లూరి సీతారామరాజు, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం, తిరుపతి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు తెలిపింది.
రంపచోడవరం, నర్సీపట్నం, కృష్ణదేవిపేట, రౌతులపూడి, మాడుగుల, ఓర్వకల్లు, వెల్దుర్తి, డోన్, గుత్తి, పొదిలి, బద్వేలు, సత్యవేడు, శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట, నాయుడుపేట, గొట్టిప్రోలు తదితర ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో ఆశ్రయం పొందవద్దని, బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని సూచించింది.