తవక్కల్ విద్యాసంస్థల గుర్తింపు రద్దు చేయాలి
- విద్యార్థి నాయకులపై దాడి ఆరోపణలు.. తవక్కల్ విద్యాసంస్థలపై విచారణ చేపట్టాలి
- దసరా సెలవుల్లో తరగతుల నిర్వహణపై అభ్యంతరం
- పాఠశాల భవనాలపై కూడా ఫిర్యాదు
- సమగ్ర విచారణకు అదనపు కలెక్టర్ హామీ
యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలి: ఏఐఎస్‌బీ, యూఎస్‌ఎఫ్‌ఐ నాయకులు
ప్రజావాణిలో అదనపు కలెక్టర్‌కు ఫిర్యాదు.. అక్రమ తరగతులు, భవన నిర్మాణాలపై విచారణకు డిమాండ్
మంచిర్యాల: రామకృష్ణాపూర్, మందమర్రి, మంచిర్యాల పరిధిలోని తవక్కల్ విద్యాసంస్థల్లో నిబంధనల ఉల్లంఘనలపై సమగ్ర విచారణ జరిపించాలని ఏఐఎస్‌బీ, యూఎస్‌ఎఫ్‌ఐ, వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. విద్యాసంస్థల్లో జరుగుతున్న అక్రమాలను ప్రశ్నించిన విద్యార్థి నాయకులపై భౌతిక దాడికి పాల్పడ్డారని ఆరోపిస్తూ, సంబంధిత యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) రాములుకు రాతపూర్వకంగా ఫిర్యాదు అందజేశారు.
దసరా సెలవుల్లో రామకృష్ణాపూర్‌లోని తవక్కల్ విద్యాసంస్థలో తరగతులు నిర్వహిస్తున్న విషయాన్ని ప్రశ్నించేందుకు వెళ్లిన తమపై పాఠశాల చైర్మన్ అబ్దుల్ అజీజ్, ఇతర సిబ్బంది భౌతిక దాడికి పాల్పడ్డారని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. తమను దుర్భాషలాడటంతో పాటు బెదిరింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆధారాలను అదనపు కలెక్టర్‌కు చూపించినట్లు నాయకులు తెలిపారు. విద్యార్థి నాయకులపై దాడికి పాల్పడిన వారిపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
మందమర్రిలోని తవక్కల్ పాఠశాల భవనాన్ని చెరువు బఫర్ జోన్‌లో నిర్మించారని నాయకులు ఆరోపించారు. మంచిర్యాలలోని పాఠశాల బస్సు కూడా వెళ్లలేని ఇరుకైన గల్లీలో కొనసాగుతోందని, అక్కడి పరిస్థితులు విద్యార్థుల భద్రతకు సమస్యగా మారే అవకాశం ఉందని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశాలపై సంబంధిత శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపించాలని కోరారు.
విద్యార్థి సంఘాల నాయకులు సమర్పించిన ఫిర్యాదును పరిశీలించిన అదనపు కలెక్టర్ రాములు, ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు.
తవక్కల్ విద్యాసంస్థల చైర్మన్ అబ్దుల్ అజీజ్, సంబంధిత సిబ్బందిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే విద్యాసంస్థల గుర్తింపును రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. మందమర్రి పాఠశాల భవనం నిర్మించిన స్థలంపై రెవెన్యూ అధికారులతో విచారణ జరిపించాలని కోరారు.
అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోకపోతే విద్యాశాఖ కార్యాలయాలను ముట్టడిస్తామని విద్యార్థి సంఘాల నాయకులు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఏఐఎస్‌బీ జిల్లా అధ్యక్షుడు దెబ్బటి అరుణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి కనుకుంట్ల సన్నీ గౌడ్, యూఎస్‌ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మిట్టపల్లి తిరుపతి, నాయకులు సాయితేజ, అరవింద్, దుర్గ ప్రసాద్, బన్నీ తదితరులు పాల్గొన్నారు.