విదేశీయుల వివరాల నమోదు తప్పనిసరి: వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత
24 గంటల్లో ఫారమ్–III ద్వారా వివరాలు నమోదు చేయాలి.. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
వరంగల్: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విదేశీయులకు వసతి కల్పించే హోటళ్లు, హాస్టళ్లు, అద్దె గృహాల యజమానులు, విద్యా, వైద్య సంస్థల నిర్వాహకులు ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్–2025 నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత సూచించారు.
విదేశీ పౌరులు, ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) కార్డుదారులు, నేపాల్, భూటాన్ దేశస్థులు సహా విదేశీయుల రాకపోకలకు సంబంధించిన వివరాలను వారు వచ్చిన లేదా వెళ్లిన 24 గంటల్లోపు ఆన్లైన్ పోర్టల్లో ఫారమ్–III (గతంలో ఫారమ్–C) ద్వారా నమోదు చేయాలని తెలిపారు.
విదేశీయుల వివరాలను నిర్దేశిత సమయంలో నమోదు చేయకపోతే ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్–2025లోని సెక్షన్ 23(బి) కింద చర్యలు తీసుకునే అవకాశం ఉందని కమిషనర్ హెచ్చరించారు. వ్యక్తిగత లేదా వాణిజ్య వసతి నిర్వాహకులకు ప్రతి ఉల్లంఘనకు కనీసం రూ.50,000, విద్యా, వైద్య సంస్థలకు కనీసం రూ.1 లక్ష జరిమానా విధించే అవకాశం ఉందని తెలిపారు. నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి నేర విచారణను కూడా ఎదుర్కోవాల్సి రావచ్చని పేర్కొన్నారు.
విదేశీయులకు వసతి కల్పించే యజమానులు, సంబంధిత సంస్థల నిర్వాహకులు చట్ట నిబంధనలను తెలుసుకుని, రాకపోకల వివరాలను సకాలంలో నమోదు చేయాలని పోలీస్ కమిషనర్ సూచించారు.