17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ.. ఈసీఐ కీలక షెడ్యూల్ విడుదల
నవంబర్ 12న ముసాయిదా ఓటరు జాబితా విడుదల
డిసెంబర్ 11 వరకు క్లెయిమ్లు, అభ్యంతరాల స్వీకరణ
2027 జనవరి 4న తుది ఓటరు జాబితా ప్రచురణ
న్యూఢిల్లీ: దేశంలోని 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఫొటో ఓటరు జాబితాల ప్రత్యేక సంక్షిప్త సవరణ (SSR) చేపట్టనున్నట్లు భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ ప్రక్రియకు 2027 జనవరి 1ను అర్హత తేదీగా నిర్ణయించింది. ఓటరు జాబితాలను నవీకరించడంతోపాటు అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడం ఈ ప్రక్రియ ప్రధాన ఉద్దేశం.
ముఖ్యమైన తేదీలు
- నవంబర్ 2, 2026: పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ ప్రక్రియ పూర్తి.
- నవంబర్ 12, 2026: ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ.
- నవంబర్ 12–డిసెంబర్ 11, 2026: క్లెయిమ్లు, అభ్యంతరాల స్వీకరణ.
- డిసెంబర్ 28, 2026: క్లెయిమ్లు, అభ్యంతరాల పరిష్కారానికి గడువు.
- జనవరి 4, 2027: తుది ఓటరు జాబితా ప్రచురణ.
ఈ 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సవరణ
అండమాన్ నికోబార్ దీవులు, అస్సాం, బిహార్, ఛత్తీస్గఢ్, గోవా, గుజరాత్, కేరళ, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, మణిపూర్, పుదుచ్చేరి, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్లో ఈ ప్రక్రియ చేపట్టనున్నారు.
ఓటర్లు ఏం చేయాలి?
ముసాయిదా ఓటరు జాబితా విడుదలైన తర్వాత ఓటర్లు తమ పేరు, చిరునామా, ఇతర వివరాలను పరిశీలించాలి. పేరు లేకపోయినా, వివరాల్లో తప్పులు ఉన్నా లేదా మార్పులు అవసరమైనా నిర్ణీత గడువులో సంబంధిత దరఖాస్తు సమర్పించాలి.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా ప్రస్తుతం ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) జరుగుతున్న లేదా ఇటీవల పూర్తయిన రాష్ట్రాలకు సంబంధించిన షెడ్యూల్ను ఎన్నికల సంఘం తర్వాత ప్రకటించనుంది. కాబట్టి ఈ 17 ప్రాంతాలకు ప్రకటించిన తేదీలను తెలంగాణకు వర్తిస్తాయని భావించకూడదు.