విద్యుత్ కోతలతో ఎండుతున్న వరి పొలాలు.. రైతు ఆవేదన
- ఎనిమిది ఎకరాల్లో సాగు.. నీటి కోసం ట్యాంకర్లపై ఆధారం
- కనీసం రెండు ఎకరాల పంటనైనా కాపాడుకోవాలని రైతు ప్రయత్నం
- వరి ఈనే దశలో నీటి కష్టాలు
- పెట్టుబడి నష్టాలతో రైతుల ఆవేదన
అనంతసాగర్, హనుమకొండ జిల్లా | ఎన్ టుడే న్యూస్: విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో వరి పొలాలు ఎండిపోతున్నాయని సనిగరపు మండలం అనంతసాగర్ గ్రామానికి చెందిన రైతు నల్లాల శ్యాంసుందర్ ఆవేదన వ్యక్తం చేశారు. తనకున్న ఎనిమిది ఎకరాల సొంత భూమిలో వరి సాగు చేయగా, బావుల్లో నీరు ఉన్నప్పటికీ విద్యుత్ సరఫరా సరిగా లేక పంటకు నీరు అందించలేకపోతున్నానని తెలిపారు.
ప్రస్తుతం వరి పంట ఈనే దశలో ఉందని, ఈ సమయంలో నీరు అందకపోతే దిగుబడిపై తీవ్ర ప్రభావం పడుతుందని రైతు ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కనీసం రెండు ఎకరాల పంటనైనా కాపాడుకోవాలనే ఉద్దేశంతో వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటికే నాలుగు ట్యాంకర్ల నీటిని తెప్పించామని, మరో రెండు తడులకు అవసరమైన నీటి కోసం ప్రయత్నిస్తున్నామని వివరించారు.
పంట సాగు కోసం పెట్టిన పెట్టుబడి వృథా కాకుండా కనీసం కొంత పంటనైనా కాపాడుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు శ్యాంసుందర్ తెలిపారు. ఇంటి అవసరాలకు ఉపయోగపడేంత పంట చేతికొచ్చినా చాలనే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడం వల్ల చిన్న, సన్నకారు రైతులతో పాటు కౌలు రైతులు కూడా తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. సంబంధిత అధికారులు స్పందించి వ్యవసాయానికి అవసరమైన విద్యుత్‌ను సక్రమంగా సరఫరా చేసి, రైతుల పంటలను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
.