స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రజలు సహకరించాలి చిత్తపూరులో అవగాహన సమావేశం నిర్వహించిన చాట్రాయి ఎస్సై డి. రామకృష్ణ
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చిత్తపూరు గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పోలీసులు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చాట్రాయి ఎస్సై డి. రామకృష్ణ మాట్లాడుతూ స్థానిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేందుకు ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని కోరారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. గ్రామాల్లో రాజకీయ విభేదాలు, వ్యక్తిగత కక్షలతో గొడవలకు దిగవద్దని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు, బెదిరింపులకు లొంగకుండా తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని తెలిపారు. ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరూ పాటించాలని, గ్రామంలో అనుమానాస్పద ఘటనలు లేదా ఎన్నికలకు ఆటంకం కలిగించే చర్యలు గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ప్రజలందరి సహకారంతో స్థానిక ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసు శాఖ సిద్ధంగా ఉందని ఎస్సై డి. రామకృష్ణ స్పష్టం చేశారు.