ఎస్‌ఐఆర్‌ను రద్దు చేయాలి: సీపీఎం డిమాండ్
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి.. ధరల పెరుగుదలను అరికట్టాలి
హైదరాబాద్, అక్టోబర్ 19: ఎస్‌ఐఆర్‌ను రద్దు చేయాలని, భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని, యూపీఐ చెల్లింపులపై విధించనున్న ఛార్జీలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సీపీఎం భోలక్‌పూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సోమవారం ప్రాగ్ టూల్స్ చౌరస్తా వద్ద నిర్వహించిన ఈ ఆందోళనలో ధరల పెరుగుదలను నియంత్రించడంతో పాటు భోలక్‌పూర్ డివిజన్‌లోని స్థానిక సమస్యలను పరిష్కరించాలని నాయకులు కోరారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీపీఎం ముషీరాబాద్ జోన్ కార్యదర్శి ఆర్. వెంకటేష్ మాట్లాడుతూ ఎస్‌ఐఆర్ ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తూ అర్హులైన ఓటర్ల పేర్లను తొలగిస్తున్నారని ఆరోపించారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను వెంటనే తొలగించాలని, ఓటర్ల జాబితా నుంచి తొలగించిన అర్హుల పేర్లను తిరిగి చేర్చాలని డిమాండ్ చేశారు.
బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయని, ధరల పెరుగుదలను నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని వెంకటేష్ విమర్శించారు. ప్రజలపై అదనపు ఆర్థిక భారం పడకుండా యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు విధించే నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు.
భోలక్‌పూర్ డివిజన్ పరిధిలోని అర్హులైన పేదలందరికీ ప్రభుత్వం ఉచితంగా ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. డివిజన్‌లో నెలకొన్న స్థానిక సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ నిరసన కార్యక్రమంలో సీపీఎం జోన్ కార్యదర్శివర్గ సభ్యులు బాబు, ఎం. కృష్ణస్వామి, పి. వెంకటేష్, వీరచారి, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.