సొంత ఖర్చులతో స్మశానవాటిక అభివృద్ధి పనులు చేపట్టిన కుమారులు
- రూ.1.50 లక్షలతో విద్యుత్ స్తంభాలు, లైట్లు, కాంక్రీట్ పనులు
- స్వాత్యంత్ర సమరయోధుడు గుమ్మి చిన్న బక్కారెడ్డికి ఘన నివాళి
- సమరయోధుడి సేవలు చిరస్మరణీయం
ఏపూర్ | ఎన్ టుడే న్యూస్: స్వాత్యంత్ర సమరయోధుడు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు గుమ్మి చిన్న బక్కారెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని శనివారం ఏపూర్ గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు చిన్న బక్కారెడ్డి చిత్రపటానికి నివాళులర్పించారు.
గుమ్మి చిన్న బక్కారెడ్డి జ్ఞాపకార్థం ఆయన కుమారులు గుమ్మి నర్సిరెడ్డి, గుమ్మి రంగారెడ్డి తమ సొంత నిధులతో గ్రామ శివారులోని స్మశానవాటికలో అభివృద్ధి పనులు చేపట్టారు. సుమారు రూ.1.50 లక్షల వ్యయంతో విద్యుత్ స్తంభాలు, లైట్లు ఏర్పాటు చేయడంతో పాటు కాంక్రీట్ పనులు చేపట్టి, గోడలకు రంగులు వేయించారు.
ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ పాలెం మహేష్ గౌడ్ హాజరై గుమ్మి చిన్న బక్కారెడ్డి చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్య పోరాటంలో, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో చిన్న బక్కారెడ్డి కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. ఆయన చేసిన సేవలు ప్రజల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతాయని అన్నారు.
గ్రామంపై ఉన్న మమకారంతో చిన్న బక్కారెడ్డి కుమారులు స్మశానవాటికలో అభివృద్ధి పనులు చేపట్టడం అభినందనీయమని సర్పంచ్ తెలిపారు. గ్రామాభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో గుమ్మి నర్సిరెడ్డి, గుమ్మి రంగారెడ్డి, కోడలు గుమ్మి భాగ్యలక్ష్మి, మునిమనవడు హర్షిత్ రెడ్డి, గుమ్మి పెద్ద నర్సిరెడ్డి, జిల్లాల మాసిరెడ్డి, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.