మున్సిపల్ ఎన్నికల్లో హింసకు పాల్పడితే కఠిన చర్యలు: రాష్ట్ర ఎన్నికల సంఘం
నామినేషన్ కేంద్రాల వద్ద అదనపు భద్రత.. సీసీ కెమెరాల ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్: మున్సిపల్ ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల సంఘం హెచ్చరించింది. రాష్ట్రంలో చోటుచేసుకున్న పలు హింసాత్మక ఘటనలను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు వెల్లడించింది.
నామినేషన్ ప్రక్రియ ఎలాంటి అవాంతరాలు లేకుండా సజావుగా జరిగేలా నామినేషన్ కేంద్రాల వద్ద అదనపు భద్రతా ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపింది. కేంద్రాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పరిస్థితులను పర్యవేక్షించనున్నట్లు పేర్కొంది.
ఎన్నికల నిర్వహణలో నిర్లక్ష్యం వహించినా, శాంతిభద్రతల సమస్యలు తలెత్తినా సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల సంఘం హెచ్చరించింది. అవసరాన్ని బట్టి అధికారులను సస్పెండ్ చేయడం లేదా బదిలీ చేయడం వంటి చర్యలు చేపడతామని స్పష్టం చేసింది.