చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠిన చర్యలు తప్పవు
- రాయచోటిలో అదనపు పోలీసు బలగాలు
- పుంగనూరు ఘటనపై ఎస్పీ వివరణ
- పోలీసులకు సహకరించాలని ఎస్పీ విజ్ఞప్తి
మున్సిపల్ నామినేషన్ల వేళ ర్యాలీలు, ఊరేగింపులకు అనుమతి లేదు: డీఐజీ కోయ ప్రవీణ్, ఎస్పీ ధీరజ్ కునుబిల్లి
మదనపల్లె: అన్నమయ్య జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్, జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి హెచ్చరించారు. రాయచోటి, పుంగనూరు మున్సిపాలిటీల్లో శుక్రవారం చోటుచేసుకున్న అవాంఛనీయ ఘటనలపై వారు స్పందించారు. నామినేషన్ల ప్రక్రియలో మిగిలిన రోజుల్లో జిల్లా వ్యాప్తంగా ర్యాలీలు, ప్రదర్శనలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.
రాయచోటిలో నామినేషన్ల తొలి రోజున రాజకీయ పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణలు, పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన ఘటనలను డీఐజీ కోయ ప్రవీణ్ తీవ్రంగా పరిగణించారు. ఒక యువ ఎంపీ అత్యుత్సాహంతో వ్యవహరించడం, వాహనాన్ని జనంలోకి వేగంగా నడపడం వల్ల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయని ఆయన పేర్కొన్నారు.
ఘర్షణలకు పాల్పడినవారితో పాటు పోలీసులపై దాడులకు పాల్పడినవారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డ్రోన్ కెమెరాలు, వీడియో రికార్డింగ్ల ఫుటేజీలను పరిశీలిస్తున్నామని తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం రాయచోటికి అదనంగా రెండు ప్లాటూన్ల పోలీసు బలగాలను రప్పించినట్లు వెల్లడించారు.
నామినేషన్ దాఖలు చేసేందుకు వెళ్లే అభ్యర్థులు ముందుగా పోలీసులకు సమాచారం అందిస్తే, బందోబస్తు మధ్య నామినేషన్ కేంద్రానికి తీసుకెళ్లి, ప్రక్రియ పూర్తయిన తర్వాత తిరిగి సురక్షితంగా చేరేలా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.
పుంగనూరు పోలీస్ స్టేషన్లో డీఐజీతో సమీక్ష అనంతరం జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి మీడియాతో మాట్లాడుతూ నామినేషన్ కేంద్రం వద్ద చోటుచేసుకున్న ఘటన వివరాలను వెల్లడించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం నామినేషన్ కేంద్రానికి 100 మీటర్ల పరిధిలో అభ్యర్థితో పాటు మరో ఇద్దరికి మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు.
వైఎస్సార్సీపీ ఎంపీ పి.వి. మిథున్ రెడ్డి సుమారు 100 మంది మద్దతుదారులతో కలిసి వాహనాల్లో నిబంధనలకు విరుద్ధంగా అక్కడికి చేరుకున్నారని ఎస్పీ ఆరోపించారు. వాహనాలతో బారికేడ్లు, గేట్లను దాటి వేగంగా లోపలికి ప్రవేశించారని, ఒక వాహనం జనాల వైపు దూసుకెళ్లడంతో పలువురికి గాయాలయ్యాయని పేర్కొన్నారు.
ఈ పరిణామాలతో ఇరువర్గాల మధ్య ఉద్రిక్తత నెలకొందని, పోలీసులు వెంటనే స్పందించి గాయపడినవారిని అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారని తెలిపారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చి ఎంపీ మిథున్ రెడ్డిని రిటర్నింగ్ అధికారి గదిలోకి తీసుకెళ్లి భద్రత కల్పించినట్లు వివరించారు. అనంతరం ఆయనను సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు చెప్పారు.
ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పోలీసులకు సహకరించాలని ఎస్పీ కోరారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని, చట్టాన్ని ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.