ఏపీ మున్సిపల్ ఎన్నికలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
19 మున్సిపాలిటీల్లో ఎన్నికల ప్రక్రియ వాయిదా
అభ్యర్థుల తుది జాబితా ప్రచురణ ఈ నెల 25 వరకు నిలిపివేత
నామినేషన్ల గడువు పొడిగింపుపై రేపటిలోగా నిర్ణయం
అమరావతి | ఎన్ టుడే న్యూస్: ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నామినేషన్ల దాఖలుకు అభ్యర్థులను అడ్డుకున్నారంటూ వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) తగిన నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది.
సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం, పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితా ప్రచురణను అక్టోబర్ 25 వరకు నిలిపివేయాలి. నామినేషన్ల గడువును పొడిగించాలన్న అభ్యర్థనపై అక్టోబర్ 22లోగా నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.
19 ప్రాంతాల్లో ఎన్నికలపై తాత్కాలిక నిలుపుదల
నామినేషన్ల సందర్భంగా సమస్యలు తలెత్తిన ఏడు జిల్లాల్లోని 19 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఎన్నికల ప్రక్రియపై తాత్కాలికంగా నిలుపుదల ప్రభావం ఉంటుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా వెల్లడించినట్లు వార్తా సంస్థలు తెలిపాయి. మిగిలిన నోటిఫై చేసిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం కొనసాగనున్నాయి.
కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష
సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఏడు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష నిర్వహించింది. నామినేషన్ల సమయంలో అభ్యర్థులకు భద్రత కల్పించాలని, ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది.