ఎంపీటీసీ నామినేషన్లలో టీడీపీ ఆధిక్యం.. జెడ్పీటీసీలో వైఎస్సార్‌సీపీ ముందంజ
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా 28 జిల్లాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం 9,829 ఎంపీటీసీ స్థానాలకు 32,095 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో తెలుగుదేశం పార్టీ తరఫున అత్యధికంగా 15,017 నామినేషన్లు దాఖలయ్యాయి. వైఎస్సార్‌సీపీ తరఫున 12,419, జనసేన నుంచి 2,073, బీజేపీ నుంచి 562 నామినేషన్లు వచ్చాయి. ఎంపీటీసీ స్థానాలకు దాఖలైన నామినేషన్లలో టీడీపీ ముందంజలో నిలవగా, వైఎస్సార్‌సీపీ రెండో స్థానంలో ఉంది.
ఇక 659 జెడ్పీటీసీ స్థానాలకు మొత్తం 2,805 నామినేషన్లు దాఖలయ్యాయి. జెడ్పీటీసీ నామినేషన్లలో వైఎస్సార్‌సీపీ అత్యధికంగా 1,092 నామినేషన్లతో మొదటి స్థానంలో నిలిచింది. తెలుగుదేశం పార్టీ తరఫున 1,055 నామినేషన్లు దాఖలయ్యాయి. జనసేన నుంచి 178, బీజేపీ నుంచి 111 నామినేషన్లు వచ్చాయి. ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ ఆధిక్యం కనబరచగా, జెడ్పీటీసీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ స్వల్ప ఆధిక్యంలో నిలిచింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రధాన పార్టీల మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది.