ఢిల్లీకి బయలుదేరిన తెలంగాణ శాసనసభాపతి, శాసనమండలి చైర్మన్
బ్రిక్స్ పార్లమెంటరీ సమావేశాల్లో తెలంగాణ అంశాలను ప్రస్తావిస్తాం
హైదరాబాద్ (ఎన్ టుడే న్యూస్): ఢిల్లీలో అక్టోబర్ 26, 27 తేదీల్లో జరగనున్న 12వ బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరమ్ సమావేశాల్లో పాల్గొనేందుకు తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ సోమవారం ఉదయం శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.
ఈ సందర్భంగా విమానాశ్రయంలో వారు మాట్లాడుతూ, బ్రిక్స్ పార్లమెంటరీ సమావేశాల వేదికగా తెలంగాణకు సంబంధించిన అంశాలను ప్రస్తావించడంతో పాటు, వివిధ అంశాలపై అభిప్రాయాలను పంచుకుంటామని తెలిపారు. ఈ సమావేశాలు రాష్ట్ర అంశాలను అంతర్జాతీయ పార్లమెంటరీ వేదికపై చర్చించేందుకు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
భారత పార్లమెంట్ ఆతిథ్యంలో జరుగుతున్న ఈ సమావేశాల్లో బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల పార్లమెంటరీ ప్రతినిధులు పాల్గొననున్నారు. ప్రజాకేంద్రిత అభివృద్ధి, పార్లమెంటరీ వ్యవస్థల బలోపేతం, సాంకేతిక పరిజ్ఞానం, ప్రపంచ పాలనలో సంస్కరణలు వంటి అంశాలపై చర్చలు జరగనున్నాయి.
వారి వెంట తెలంగాణ శాసనమండలి కార్యదర్శి డాక్టర్ నరసింహాచార్యులు, శాసనసభాపతి ఓఎస్డీ వెంకటేష్, శాసనమండలి చైర్మన్ ఓఎస్డీ గోవర్ధన్ రెడ్డి తదితరులు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.