ఎన్హెచ్ఎం ఉద్యోగుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి
ఎన్హెచ్ఎం ఉద్యోగుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి: నగునూరి వెంకటేశ్వర్ గౌడ్
సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి
ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలి.. కలెక్టరేట్ ఎదుట మూడో రోజుకు చేరిన ధర్నా
ఎన్హెచ్ఎం ఉద్యోగులకు బీజేపీ మద్దతు
మంచిర్యాల: నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం) ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని కోరుతూ జిల్లా కలెక్టరేట్ ఎదుట ఎన్హెచ్ఎం ఉద్యోగులు చేపట్టిన ధర్నా మూడో రోజుకు చేరుకుంది. ఈ ధర్నా శిబిరాన్ని సందర్శించిన బీజేపీ నాయకులు ఉద్యోగులకు మద్దతు ప్రకటించారు.
ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలి
ఈ సందర్భంగా నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ.. ఎన్హెచ్ఎం ఉద్యోగులు ప్రజారోగ్య సేవల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. దీర్ఘకాలంగా సేవలందిస్తున్న ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయడంతోపాటు ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని కోరారు.
మహారాష్ట్ర, అరుణాచల్ ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లో ఎన్హెచ్ఎం సిబ్బంది వేతనాలు, ఉద్యోగాల క్రమబద్ధీకరణకు సంబంధించి తీసుకున్న చర్యలను ఆయన ప్రస్తావించారు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఉద్యోగుల సమస్యలపై చిత్తశుద్ధితో స్పందించి, వారి డిమాండ్ల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అన్నారు.
స్పందించకపోతే పోరాటం ఉధృతం చేస్తాం
ఎన్హెచ్ఎం ఉద్యోగులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని వెంకటేశ్వర్ గౌడ్ కోరారు. ఉద్యోగాలను పర్మినెంట్ చేయడంతోపాటు గరిష్ఠ వేతనం అందించే దిశగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో ఉద్యోగుల పక్షాన నిలబడి బీజేపీ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తుందని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మంచిర్యాల కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ ముఖేష్ గౌడ్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు కమలాకర్ రావు, పట్టి వెంకటకృష్ణ, జిల్లా కార్యదర్శి రాచర్ల సంతోష్, నస్పూర్ జోన్ అధ్యక్షుడు కుర్ర చక్రవర్తి తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.