చర్లగూడెం ప్రాజెక్టు నుంచి చౌటుప్పల్ వరకు పాదయాత్రను జయప్రదం చేయాలి
నవంబర్ 1, 2, 3 తేదీల్లో పాదయాత్ర, ధర్నా.. సీపీఎం నాయకుల పిలుపు
సంస్థాన్ నారాయణపురం, అక్టోబర్ 23: చర్లగూడెం ప్రాజెక్టు నుంచి చౌటుప్పల్ ఆర్డీవో కార్యాలయం వరకు నవంబర్ 1, 2, 3 తేదీల్లో నిర్వహించనున్న పాదయాత్ర, ధర్నాను జయప్రదం చేయాలని సీపీఎం మండల కార్యదర్శివర్గ సభ్యుడు చింతకాయల నరసింహ పిలుపునిచ్చారు.
యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం వావిళ్లపల్లి గ్రామంలో శుక్రవారం సీపీఎం గ్రామ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పాదయాత్రలో నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
పాదయాత్రలో పాల్గొనే బృందానికి వావిళ్లపల్లిలో మధ్యాహ్న భోజన ఏర్పాట్లు చేయాలని గ్రామ శాఖ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. అలాగే నవంబర్ 15న నల్లగొండలో నిర్వహించనున్న అఖిల భారత రైతు సంఘం మహాసభకు ప్రజలను సమీకరించి, బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో సీపీఎం గ్రామ శాఖ కార్యదర్శి కుక్కల అంజయ్య, ఎంపల మారయ్య, దోటి యాదయ్య, చింతకాయల లింగస్వామి, చింతకాయల సత్తయ్య, జింకల మహేష్, జింకల సాయి, కోల పుల్లయ్య, చింతకాయల నరసింహ తదితరులు పాల్గొన్నారు.