సమాజ అభివృద్ధిలో మహిళా జర్నలిస్టుల పాత్ర కీలకం
తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
NTODAY NEWS : హైదరాబాద్,
సమాజ అభివృద్ధిలో మహిళా జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ప్రజల సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు.
హైదరాబాద్‌లోని నాంపల్లి మీడియా అకాడమీలో నిర్వహిస్తున్న అఖిల భారత మహిళా జర్నలిస్టుల సమ్మేళనంలో భాగంగా శనివారం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళా జర్నలిస్టులు గుత్తా సుఖేందర్ రెడ్డిని శాలువాతో ఘనంగా సత్కరించారు. తెలంగాణ రాష్ట్రం గొప్ప సంస్కృతి, సంప్రదాయాలకు నిలయమని, బతుకమ్మ, బోనాలు వంటి పండుగలు రాష్ట్ర సాంస్కృతిక వైభవానికి ప్రతీకలని వివరించారు. కళలు, సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో సాంస్కృతిక కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. ఇటువంటి కార్యక్రమాలు దేశంలోని వివిధ ప్రాంతాల మధ్య సాంస్కృతిక అనుబంధాన్ని మరింత బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు.
మహిళా జర్నలిస్టులు సమాజంలోని అసమానతలు, మహిళల సమస్యలు, సామాజిక అంశాలపై ప్రజల్లో మరింత చైతన్యం తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. మహిళలు అన్ని రంగాల్లో ఉన్నత స్థాయికి ఎదగాలని, మహిళా జర్నలిస్టులు వృత్తిపరంగా మరిన్ని విజయాలు సాధించాలని కోరుతూ సమ్మేళన నిర్వాహకులకు, పాల్గొన్న జర్నలిస్టులకు శుభాకాంక్షలు తెలిపారు.