నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పరిశీలించిన తిరువూరు ఆర్డీఓ ఏ. కుమార్
ఎన్టీఆర్ జిల్లా, గంపలగూడెం: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు జరుగుతున్న నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను తిరువూరు రెవెన్యూ డివిజన్ అధికారి ఏ. కుమార్ గురువారం పరిశీలించారు. గంపలగూడెం మండల కేంద్రంలోని మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో కొనసాగుతున్న నామినేషన్ల స్వీకరణ తీరును ఆయన క్షేత్రస్థాయిలో సమీక్షించారు. ఈ సందర్భంగా నామినేషన్ల స్వీకరణకు సంబంధించి చేపట్టిన ఏర్పాట్లు, ఎన్నికల నిబంధనల అమలు, ఎన్నికల సిబ్బంది విధుల నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు. నామినేషన్ల దాఖలు ప్రక్రియలో ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటించాలని, అభ్యర్థులు సమర్పించే పత్రాలను నిబంధనల ప్రకారం క్షుణ్ణంగా పరిశీలించాలని సంబంధిత అధికారులకు సూచించారు. నామినేషన్ల స్వీకరణలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా, పారదర్శకంగా విధులు నిర్వహించాలని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియలో ప్రతి దశను నిబంధనలకు అనుగుణంగా నిర్వహిస్తూ, అభ్యర్థులకు అవసరమైన సమాచారం అందించాలని తెలిపారు. ఎన్నికల నిర్వహణలో అధికారులు సమన్వయంతో పనిచేసి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను ప్రశాంతంగా, సజావుగా పూర్తి చేయాలని ఆర్డీఓ సూచించారు. ఈ పరిశీలనలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి (ఆర్‌ఓ), ఎంపీడీఓ, సంబంధిత ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు
.