మణుగూరు కండక్టర్పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి
ఎంప్లాయీస్ యూనియన్ మధిర డిపో కమిటీ డిమాండ్
మధిర, అక్టోబర్ 25: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) ఖమ్మం రీజియన్ పరిధిలోని మణుగూరు డిపోకు చెందిన కండక్టర్ ప్రవళికపై విధి నిర్వహణలో జరిగిన దాడిని ఎంప్లాయీస్ యూనియన్ మధిర డిపో కమిటీ తీవ్రంగా ఖండించింది. విధుల్లో ఉన్న ఆర్టీసీ మహిళా ఉద్యోగిపై దాడికి పాల్పడిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని ఆర్టీసీ యాజమాన్యాన్ని, ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. గాయపడిన కండక్టర్ ప్రవళికకు మెరుగైన వైద్యం అందించి, ఆమెకు తగిన న్యాయం చేయాలని కోరింది. రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చినప్పటి నుంచి విధులు నిర్వహిస్తున్న కండక్టర్లు, డ్రైవర్లపై దాడులు పెరుగుతున్నాయంటూ యూనియన్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రయాణికులకు ఏవైనా సమస్యలు ఎదురైతే వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలే తప్ప, విధుల్లో ఉన్న సిబ్బందిపై దాడులకు పాల్పడటం ఎంతమాత్రం సమర్థనీయం కాదని పేర్కొన్నారు. ప్రయాణికులకు సేవలందిస్తూ నిరంతరం శ్రమిస్తున్న ఆర్టీసీ కార్మికుల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు సంస్థ యాజమాన్యంపై ఉందన్నారు. బస్సుల్లో హెచ్చరికల ప్రకటనలు చేయడంతోనే సరిపెట్టకుండా, సిబ్బందిపై దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కండక్టర్ ప్రవళికపై దాడి చేసిన వారిని శిక్షించి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ఠమైన భద్రతా చర్యలు చేపట్టాలని కోరారు. విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులకు రక్షణ కల్పించి, వారిలో భరోసా నింపాలని యూనియన్ నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి తిమ్మినేని రామారావు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అరుణకుమారి, రాష్ట్ర సహాయ కార్యదర్శి రాంచందర్ రావు, మధిర డిపో అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, డిపో కార్యదర్శి షేక్ నాగుల్ మీరా, నాయకులు వి. రామకృష్ణ, సత్యనారాయణ, హరికృష్ణ, శ్యామ్ బాబు, ఎస్.కె. రహీం, షాకీర్, సాయికుమార్, సరస్వతి, నాగమల్లేశ్వరి, రాధిక తదితరులు పాల్గొన్నారు.