సద్దుల బతుకమ్మ వేడుకల్లో విషాదం.. ఇద్దరు మహిళలు మృతి
ఖమ్మం జిల్లాలో డీజే శబ్దం వినిపిస్తుండగా కుప్పకూలిన మహిళ.. ఆసిఫాబాద్ సమీపంలో బతుకమ్మ ఆడుతూ ప్రాణాలు కోల్పోయిన యువతి
సద్దుల బతుకమ్మ వేడుకలు రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపాయి. వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మహిళలు మృతి చెందారు. ఖమ్మం జిల్లాలో డీజే శబ్దం వినిపిస్తుండగా ఓ మహిళ కుప్పకూలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ఆసిఫాబాద్ సమీపంలోని బూరుగుడ గ్రామంలో బతుకమ్మ ఆడుతూ ఓ యువతి కుప్పకూలి మృతి చెందింది.
డీజే శబ్దం వినిపిస్తుండగా కుప్పకూలిన మహిళ
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం అప్పలనరసింహాపురం గ్రామంలో బతుకమ్మ వేడుకలు జరుగుతుండగా యాలగాల భారతి (55) అనే మహిళ ఒక్కసారిగా కుప్పకూలింది. అక్కడికక్కడే ఆమె మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది.
బతుకమ్మ ఆడుతూ యువతి మృతి
హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేస్తున్న శ్రీవాణి (25) బతుకమ్మ పండుగ కోసం ఆసిఫాబాద్ సమీపంలోని బూరుగుడ గ్రామంలో ఉన్న అమ్మమ్మ ఇంటికి వెళ్లింది. అక్కడ బతుకమ్మ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటూ ఒక్కసారిగా కుప్పకూలింది. వెంటనే ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
సద్దుల బతుకమ్మ పండుగ వేళ చోటుచేసుకున్న ఈ రెండు ఘటనలు కుటుంబ సభ్యులు, స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయి.