డిజిటల్ అరెస్ట్ పేరుతో రూ.29.17 లక్షల మోసం.. ఇద్దరు అరెస్ట్
ఢిల్లీ పోలీసులమంటూ రిటైర్డ్ ఉద్యోగిని బెదిరించిన సైబర్ నేరగాళ్లు
హైదరాబాద్ (ఎన్ టుడే న్యూస్): డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరగాళ్లు రూ.29.17 లక్షలు కాజేసిన కేసులో హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఢిల్లీ పోలీస్, సీబీఐ, ఈడీ అధికారులమంటూ అమీర్పేటకు చెందిన ఓ రిటైర్డ్ ఉద్యోగిని బెదిరించి, మనీలాండరింగ్ కేసులో ఇరికిస్తామని భయపెట్టి నగదు బదిలీ చేయించుకున్నట్లు పోలీసులు గుర్తించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. రూ.6.8 కోట్ల మనీలాండరింగ్ కేసులో బాధితుడి పేరు ఉందని నమ్మించిన సైబర్ నేరగాళ్లు, విచారణ నుంచి బయటపడాలంటే వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పారు. ఈ క్రమంలో బాధితుడు, ఆయన కుమార్తె నుంచి మొత్తం రూ.29.17 లక్షలను తమకు సంబంధించిన ఖాతాలకు బదిలీ చేయించుకున్నారు.
ఈ కేసులో అమీర్పేటకు చెందిన మొహమ్మద్ అష్ఫాక్ హుస్సేన్, అహ్మద్ నజీబ్ ఉద్దీన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరుకు చెందిన సచిన్ అనే మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు గుర్తించారు.
విచారణలో మోసపూరితంగా పొందిన సొమ్మును మ్యూల్ బ్యాంకు ఖాతాల ద్వారా మళ్లించినట్లు వెల్లడైంది. చెక్కుల ద్వారా నగదు విత్డ్రా చేసి ఇతర ఖాతాల్లో జమ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అలాగే యూఎస్డీటీ క్రిప్టోకరెన్సీ లావాదేవీల ద్వారా డబ్బు ఆనవాళ్లను దాచేందుకు ప్రయత్నించినట్లు, ఈ వ్యవహారంలో నిందితులు కమీషన్లు పొందినట్లు విచారణలో తేలింది.
ప్రజలకు పోలీసుల సూచన: ఫోన్ లేదా వీడియో కాల్లో పోలీసులమని, సీబీఐ లేదా ఈడీ అధికారులమని చెప్పి అరెస్ట్ చేస్తామని బెదిరించే వ్యక్తులను నమ్మవద్దు. డిజిటల్ అరెస్ట్ పేరుతో డబ్బు బదిలీ చేయాలని కోరితే స్పందించకుండా, వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలి.