తెలంగాణ రాజ్యాధికార పార్టీకి ఇద్దరు నూతన జిల్లా అధ్యక్షులు
సంగారెడ్డి అధ్యక్షుడిగా కోనదొడ్డి నరసింహ.. జోగులాంబ గద్వాల అధ్యక్షుడిగా ఉప్పరి గంగాధర్
హైదరాబాద్: తెలంగాణ రాజ్యాధికార పార్టీని రాష్ట్రవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే లక్ష్యంతో పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఇద్దరు నూతన జిల్లా అధ్యక్షులను నియమించారు. పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా సంగారెడ్డి, జోగులాంబ గద్వాల జిల్లాలకు కొత్త అధ్యక్షులను ఎంపిక చేశారు.
సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా కోనదొడ్డి నరసింహ, జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షుడిగా ఉప్పరి గంగాధర్ను నియమిస్తూ తీన్మార్ మల్లన్న ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల రాజకీయ సాధికారత లక్ష్యంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ముందుకు సాగుతోందని తెలిపారు. గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు పార్టీని బలోపేతం చేసేందుకు సంస్థాగత నియామకాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
నూతనంగా నియమితులైన జిల్లా అధ్యక్షులు పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ఆయా జిల్లాల్లో పార్టీ విస్తరణకు కృషి చేయాలని సూచించారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ సామాజిక న్యాయం, బీసీ రాజ్యాధికార సాధన దిశగా పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.