వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి ఆదర్శనీయం
వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి ఆదర్శనీయం: మున్సిపల్ చైర్‌పర్సన్ వేముల నాగలక్ష్మి
ధర్మపురి:
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఎంతో ఆదర్శనీయమని ధర్మపురి మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి వేముల నాగలక్ష్మి అన్నారు. వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకుని గురువారం ధర్మపురి పట్టణంలోని స్థానిక నంది చౌక్ వద్ద ఉన్న ఆమె విగ్రహానికి చైర్‌పర్సన్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ మాట్లాడుతూ.. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరీ విముక్తి కోసం దొరల పెత్తనానికి, నైజాం అన్యాయాలకు వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడిన ధీర వనిత చాకలి ఐలమ్మ అని కొనియాడారు. ఆమె చూపిన ధైర్యసాహసాలు, ఆత్మగౌరవ పోరాటం మహిళా చైతన్యానికి, సామాజిక న్యాయానికి చిహ్నంగా నిలిచాయని పేర్కొన్నారు. ఆమె ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఐలమ్మకు మనం ఇచ్చే నిజమైన నివాళి అని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంఘనబట్ల దినేష్, కౌన్సిలర్లు చిపిరిశెట్టి రాజేష్, సంగి ఆనంద్, రజక సంఘ నాయకులు, ప్రతినిధులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.