మహా చండి అవతారంలో దర్శనమిచ్చిన వైష్ణవి దేవి
పుదిపట్ల ఆలయంలో నాలుగో రోజు నవరాత్రి పూజలు.. లలితా సహస్రనామ పారాయణం
అన్నమయ్య జిల్లా: చౌడేపల్లి మండలం పుదిపట్ల గ్రామంలోని స్వయంభు వైష్ణవి దేవి ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. నవరాత్రుల నాలుగో రోజు అమ్మవారు మహా చండి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
ఆలయ అర్చకురాలు శ్రావణి ఉదయాన్నే అమ్మవారికి పంచామృత అభిషేకం నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శనానికి అవకాశం కల్పించారు. చౌడేపల్లి, పుంగనూరు ప్రాంతాలతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.
అమ్మవారి సన్నిధిలో మహిళలు లలితా సహస్రనామ పారాయణం, మహిషాసురమర్దిని పారాయణం నిర్వహించారు. ఈ కార్యక్రమాలతో ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు లద్దిగం గ్రామానికి చెందిన గుణవతి, పుంగనూరుకు చెందిన కుమార్ రాజు ధర్మపత్ని శ్రీజ ఉభయదారులుగా వ్యవహరించారు. ఆలయ ధర్మకర్త వినోద్ కుమార్ భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.