వరంగల్‌లో ఘనంగా గురుపూజోత్సవం
గురువుల సేవలు ప్రశంసనీయం.. విద్యార్థుల భవిష్యత్ నిర్మాణంలో కీలక పాత్ర: కలెక్టర్ సత్య శారద, సీపీ ఎన్. శ్వేత
వరంగల్ | Ntoday News
వరంగల్‌లో గురుపూజోత్సవ కార్యక్రమాన్ని శనివారం ఆకుతోట కన్వెన్షన్ హాల్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సత్య శారద, పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్‌ను తీర్చిదిద్దడంలో గురువుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. విద్యను అందించడంతో పాటు విద్యార్థుల్లో విలువలు, క్రమశిక్షణ, బాధ్యతాయుతమైన ప్రవర్తనను పెంపొందించడంలో ఉపాధ్యాయులు చేస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు.
సమాజ అభివృద్ధికి విద్య ఎంతో ముఖ్యమని, విద్యార్థులకు మంచి మార్గనిర్దేశం చేస్తూ వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు.
అనంతరం విద్యా రంగంలో ఉత్తమ సేవలు అందించిన ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించి అభినందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.