ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య..
రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం
కర్ణాటకలోని విజయపురాలో ఘటన.. భార్య, ప్రియుడితో పాటు మరో ఇద్దరు అరెస్ట్
కర్ణాటకలోని విజయపురా ఏక్తా నగర్‌లో భర్తను ప్రియుడితో కలిసి హత్య చేసి, దానిని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో మృతుడి భార్య అశ్విని, ఆమె ప్రియుడు కల్లూర్‌తో పాటు వారికి సహకరించిన మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
విజయపురాకు చెందిన రాజశేఖర్ బిరాదర్ (42), అశ్విని (30)లకు పదేళ్ల క్రితం వివాహమైంది. ఈ దంపతులకు ఇద్దరు కవల కుమారులు ఉన్నారు. ఏడు నెలల క్రితం వారు కొత్తగా ఇల్లు నిర్మించుకున్నారు. ఆ ఇంటికి రంగులు వేసే పనులను కల్లూర్ అనే వ్యక్తికి అప్పగించారు. ఈ క్రమంలో కల్లూర్ తరచూ ఇంటికి వచ్చి వెళ్తుండగా, అతనితో అశ్వినికి వివాహేతర సంబంధం ఏర్పడినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం.
భర్త తమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన అశ్విని, కల్లూర్‌తో కలిసి రాజశేఖర్‌ను హత్య చేసేందుకు పథకం వేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇందులో భాగంగా అక్టోబర్ 4న రాజశేఖర్ వాకింగ్‌కు వెళ్లిన సమయంలో కారుతో ఢీకొట్టి హత్య చేసినట్లు దర్యాప్తులో తేలినట్లు తెలుస్తోంది.
అనంతరం తన భర్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు అశ్విని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, అశ్విని వ్యవహారంపై అనుమానం రావడంతో ఆ కోణంలో విచారణ జరిపారు. దీంతో భర్త హత్య వెనుక అశ్విని, కల్లూర్‌ల ప్రమేయం ఉన్నట్లు గుర్తించిన పోలీసులు, వారికి సహకరించిన మరో ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు.