చెరువులకు నీరు మళ్లించేందుకు కాల్వ పనులు ప్రారంభం
కాల్వ నిర్మాణానికి స్వచ్ఛందంగా భూములిచ్చేందుకు ముందుకొచ్చిన రైతులు
NTODAY NEWS:
నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి పెద్ద చెరువు నుంచి ఆరెగూడెం గూనుగుంట వరకు, మోర్సగూడెం మీదుగా చిన్నకాపర్తి వరకు నీటిని మళ్లించేలా కాల్వ పనులు ప్రారంభించినట్లు చిట్యాల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కాటం వెంకటేశం తెలిపారు. నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశం సహకారంతో ఈ పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా వెంకటేశం మాట్లాడుతూ.. ఎల్నినో ప్రభావంతో నీటి ఎద్దడి ఏర్పడే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని, వర్షపు నీరు వృథా కాకుండా గొలుసుకట్టు కాల్వల ద్వారా చెరువులను నింపేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కాల్వ నిర్మాణానికి రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. కాల్వ పనులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సహకరిస్తున్న రైతులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ ముద్దసాని రమణారెడ్డి, పిశాటి మాధవరెడ్డి, రాసమల్ల జానయ్య, సత్తిరెడ్డి, గంట్ల పుల్లారెడ్డితో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు.