కళాసాధన నృత్య కళానికేతన్లో ఘనంగా ప్రపంచ కూచిపూడి దినోత్సవం
మధిర: ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని కళాసాధన నృత్య కళానికేతన్లో గురువారం ప్రపంచ కూచిపూడి నృత్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నృత్య గురువు కళ్యాణపు నాగరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో చిన్నారులు, నృత్య గురువులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చిన్నారులకు కూచిపూడి నృత్య కళ యొక్క ప్రాముఖ్యతను వివరించారు. భారతీయ సాంప్రదాయ కళల్లో కూచిపూడి నృత్యానికి విశిష్టమైన స్థానం ఉందని, ఈ కళను నేర్చుకోవడం ద్వారా చిన్నారుల్లో ఏకాగ్రత, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని తెలిపారు. చిన్నతనం నుంచే పిల్లలకు సాంప్రదాయ కళలపై ఆసక్తి కల్పించడం ద్వారా మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించవచ్చని పేర్కొన్నారు.
అనంతరం చిన్నారుల సమక్షంలో కేక్ కట్ చేసి, అందరికీ మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కూచిపూడి నృత్య గురువు అమృత వర్షిని, నృత్య పాఠశాల ఇన్చార్జి సింధు, చిన్నారుల తల్లిదండ్రులు, ఇతరులు పాల్గొన్నారు.