యువత ఉపాధి లక్ష్యంగా జూన్ 16న మెగా జాబ్ మేళా
ప్రత్తిపాటి ఫౌండేషన్, ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో భారీ ఉద్యోగ అవకాశాలు – సద్వినియోగం చేసుకోవాలి గిరీష్ బాబు
చిలకలూరిపేట: ఈ నెల 16వ తేదీన ప్రత్తిపాటి ఫౌండేషన్, ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రత్తిపాటి గార్డెన్స్‌లో నిర్వహించనున్న మెగా జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని చైతన్య ఎలైట్ స్కూల్ కరస్పాండెంట్ ఈదర గిరీష్ బాబు కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు గల నిరుద్యోగ యువతి, యువకులు ఈ జాబ్ మేళాలో పాల్గొనాలని సూచించారు. పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ తదితర విద్యార్హతలు కలిగిన వారు అర్హులని, కనీసం పదో తరగతి అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని తెలిపారు.
నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో ఈ మెగా జాబ్ మేళా నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ జాబ్ మేళాలో జోయాలుక్కాస్, డీమార్ట్, రిలయన్స్ జియో, టాటా క్యాపిటల్, కియా, ఐసుజు, ఎస్‌బీఐ కార్డ్, ఫ్లిప్‌కార్ట్, జెప్టో, క్వెస్, మహీంద్రా సీఐఈ, ఎంఆర్ఎఫ్ తదితర 40కు పైగా ప్రముఖ సంస్థలు పాల్గొంటున్నాయని తెలిపారు. వివిధ విభాగాల్లో 2,000కు పైగా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నందున యువత ఈ అవకాశాన్ని తప్పక వినియోగించుకోవాలని సూచించారు.అదేవిధంగా, ఎంపికైన అభ్యర్థులకు అదే రోజు ఆఫర్ లెటర్లు అందజేయనున్నట్లు తెలిపారు. యువత ఈ అరుదైన అవకాశాన్ని కోల్పోకుండా పెద్ద సంఖ్యలో హాజరై తమ భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని ఇలాంటి ఉపాధి కల్పన కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తూ యువతకు అండగా నిలుస్తున్న ప్రత్తిపాటి పుల్లారావుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. భవిష్యత్తులో కూడా ఆయన ఆధ్వర్యంలో మరెన్నో ప్రజోపయోగ కార్యక్రమాలు విజయవంతంగా జరగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మేఘనా ఆయిల్ అండ్ ఆగ్రో ప్రొడక్ట్స్ మేనేజింగ్ డైరెక్టర్ వలేటి శ్రీనివాసరావు పాల్గొని, చిలకలూరిపేట నియోజకవర్గ నిరుద్యోగ యువత కోసం ఇంత పెద్ద ఎత్తున మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్న ప్రత్తిపాటి పుల్లారావుకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. యువత ఉపాధి అవకాశాల కోసం చేపడుతున్న ఈ కార్యక్రమం ఎంతో అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. మెగా జాబ్ మేళాకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం 7779858789, 7842747682, 9848793357, 7702921219 నంబర్లను సంప్రదించాలని చైతన్య ఎలైట్ స్కూల్ కరస్పాండెంట్ గిరీష్ బాబు ఈ సందర్భంగా కోరారు.