ఇంగ్లండ్కు ఎందుకు వచ్చారు.. ఇక్కడి నుంచి వెళ్లిపోండి
యూకేలో భారతీయ విద్యార్థులకు వేధింపులు.. స్వయంప్రకటిత రక్షక బృందంపై విమర్శలు
లండన్: యునైటెడ్ కింగ్డమ్లోని వెస్ట్ మిడ్లాండ్స్ ప్రాంతంలో భారతీయ విద్యార్థులు వేధింపులకు గురయ్యారు. సోలిహల్లోని మెరిడెన్ పార్క్లో రాత్రివేళ గస్తీ నిర్వహించిన ‘చెల్మ్స్లీ వుడ్ పేట్రియాట్స్’ అనే స్వయంప్రకటిత రక్షక బృందం ముగ్గురు భారతీయ విద్యార్థులను ప్రశ్నిస్తూ, అక్కడి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించింది.
విద్యార్థులను చూసిన బృంద సభ్యులు వారు ఇంగ్లండ్కు ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. మళ్లీ పార్కులో కనిపించవద్దని, తమ ఇళ్లకు వెళ్లిపోవాలని హెచ్చరించినట్లు వీడియోలో కనిపించింది. ఈ ఘటనను బృంద సభ్యులే చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. అనంతరం ఆ వీడియోను తమ సోషల్ మీడియా ఖాతా నుంచి తొలగించారు. అయితే అప్పటికే ఆ దృశ్యాలు ఇతర సామాజిక మాధ్యమాల్లోనూ వ్యాపించాయి.
మహిళలు, పిల్లల భద్రత కోసమే రాత్రివేళ పార్కులో గస్తీ నిర్వహించినట్లు ఆ బృందం తన చర్యలను సమర్థించుకుంది. అయితే భారతీయ విద్యార్థులను వారి జాతి, చర్మరంగు ఆధారంగా లక్ష్యంగా చేసుకుని వేధించారని స్థానిక ఉద్యమకారులు ఆరోపించారు. ఈ ఘటనతో బహిరంగ ప్రదేశాల్లో స్వయంప్రకటిత బృందాలు ప్రజలను ప్రశ్నించడం, వెళ్లిపోవాలని హెచ్చరించడం వంటి చర్యలపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి.
ఈ ఘటనపై వెస్ట్ మిడ్లాండ్స్ పోలీసులు స్పందిస్తూ, ఇలాంటి గస్తీ చర్యలను తాము సమర్థించడం లేదా ప్రోత్సహించడం లేదని స్పష్టం చేశారు. చట్టపరమైన తనిఖీలు, పోలీసింగ్ అధికారాలు పోలీసులకే ఉంటాయని పేర్కొన్నారు.