పెనుగొలనులో భక్తి పారవశ్యం.. లోక కళ్యాణార్థం నగర సంకీర్తన హనుమాన్ చాలీసా పారాయణం, భజనలతో ఆధ్యాత్మిక వాతావరణం
గంపలగూడెం: ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు నియోజకవర్గం, గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. లోక కళ్యాణాన్ని ఆకాంక్షిస్తూ ఆదివారం ఉదయం సత్యసాయి సేవా కమిటీ ఆధ్వర్యంలో నగర సంకీర్తన కార్యక్రమం చేపట్టారు. గ్రామంలోని శివాలయ ప్రాంగణంలో ఉన్న షిరిడీ సాయిబాబా మందిరం నుంచి ప్రారంభమైన నగర సంకీర్తన రేడియో రూము, వాటర్ ట్యాంక్ రోడ్డు, బస్టాండ్, బొడ్రాయి సెంటర్, రామాలయం మీదుగా కొనసాగింది. భక్తులు సాయినామ స్మరణతో పాటు శ్రీరామ నామాన్ని జపిస్తూ నగర సంకీర్తనలో పాల్గొన్నారు. ‘ఓం సాయి.. శ్రీ సాయి.. జయ జయ సాయి’, ‘శ్రీరామ.. జయరామ.. జయ జయ రామ’ నామ పారాయణంతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భగవన్నామ స్మరణతో మనశ్శాంతి, సమాజంలో సుఖసంతోషాలు వెల్లివిరియాలని భక్తులు ఆకాంక్షించారు. సత్యసాయి సేవా కమిటీ సభ్యులు డాక్టర్ జి. నరసింహారావు, సుగ్గల హనుమంతరావు, పారేపల్లి కృష్ణారావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
హనుమాన్ చాలీసా పారాయణంతో భక్తుల సందడి
పెనుగొలను గ్రామంలోని బొడ్రాయి సెంటర్‌లో ఉన్న అభయ ఆంజనేయస్వామి ఏకశిలా విగ్రహం వద్ద శనివారం రాత్రి భక్త బృందం ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా పారాయణం, భజన కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ముందుగా అభయ ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు చేసి స్వామివారిని పుష్పాలతో అలంకరించారు. అనంతరం భక్తులు సామూహికంగా హనుమాన్ చాలీసా పారాయణం చేస్తూ భజనల్లో పాల్గొన్నారు. స్వామివారి నామస్మరణతో బొడ్రాయి సెంటర్ ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. కార్యక్రమానికి హాజరైన భక్తులకు వివిధ రకాల ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను బొలగాని నాగయ్య, కోట దాసు, పసుమర్తి లక్ష్మణరావు తదితరులు పర్యవేక్షించారు. గ్రామంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా భక్తుల్లో భక్తిభావం, ఐకమత్యం మరింత పెంపొందుతున్నాయని స్థానికులు పేర్కొన్నారు.