Pulivendula: పులివెందులలో వాహనాలకు నిప్పు.. 8 వాహనాలు దగ్ధం
పులివెందుల (ఎన్ టుడే న్యూస్):
పులివెందులలో గుర్తుతెలియని వ్యక్తులు వాహనాలకు నిప్పంటించిన ఘటన కలకలం రేపింది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత శిల్పారామం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఉలిమెల గ్రామానికి చెందిన మధుసూదన్ రెడ్డికి చెందిన పొలంలోని నివాసం వద్ద నిలిపి ఉంచిన వాహనాలకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించారు.
11 ద్విచక్ర వాహనాలు, మూడు కార్లు లక్ష్యంగా..
నివాసం వద్ద నిలిపి ఉంచిన 11 ద్విచక్ర వాహనాలు, మూడు కార్లతో పాటు ఒక ట్రాక్టర్ ట్రాలీకి నిప్పు పెట్టినట్లు సమాచారం. మంటలు వేగంగా వ్యాపించడంతో వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
అయితే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకునేలోపే సుమారు ఎనిమిది వాహనాలు పూర్తిగా దగ్ధమైనట్లు తెలిసింది. మిగిలిన వాహనాలకు కూడా నష్టం వాటిల్లినట్లు సమాచారం.
పోలీసుల దర్యాప్తు
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు స్థలానికి చేరుకుని పరిశీలించారు. వాహనాలకు నిప్పంటించిన గుర్తుతెలియని వ్యక్తులు ఎవరు? ఈ ఘటనకు గల కారణాలేమిటి? అనే కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల విచారణలో వెల్లడికావాల్సి ఉంది.