ప్రజలు డిజిటల్ బ్యాంకింగ్‌పై అవగాహన పెంచుకోవాలి
సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఆర్ బి ఐ ఎల్ డి ఓ చిరంజీవి
మద్దివంచలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం
మహబూబాబాద్ ,గార్ల, అక్టోబర్ 29: మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం మద్దివంచ గ్రామ పంచాయతీలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో ఫైనాన్షియల్ సాచురేషన్ అవేర్‌నెస్ క్యాంప్ నిర్వహించారు. గ్రామ సర్పంచ్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆర్ బి ఐ ఎల్ డి ఓ చిరంజీవి ప్రజలకు ఆర్థిక అక్షరాస్యత, డిజిటల్ బ్యాంకింగ్, పొదుపు, బీమా పథకాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ప్రతి పౌరుడు డిజిటల్ బ్యాంకింగ్ సేవలను వినియోగించుకోవాలని, ప్రతి ఒక్కరూ బ్యాంకు ఖాతా కలిగి ఉండాలని సూచించారు. ప్రజలు తమ పొదుపును సురక్షితమైన బ్యాంకుల్లోనే దాచుకోవాలని, ప్రతి బ్యాంకు ఖాతాకు నామినీని నమోదు చేసుకోవాలని తెలిపారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ తమకు అనుకూలమైన బీమా పథకాల్లో చేరి ఆర్థిక భద్రత పొందాలని సూచించారు.
ప్రస్తుత కాలంలో పెరుగుతున్న సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. బ్యాంకు ఖాతాలకు సంబంధించిన ఓటీపీ, పాస్‌వర్డ్, ఇతర రహస్య సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులకు వెల్లడించవద్దని స్పష్టం చేశారు. గుర్తుతెలియని వ్యక్తులు పంపే లింకులను క్లిక్ చేయవద్దని, ఆన్‌లైన్ లావాదేవీలు నిర్వహించేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో నాబార్డ్ డి డి ఎం సాయిరాం, జిల్లా ఎల్ డి ఎం యాదగిరి, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మహబూబాబాద్ మేనేజర్, ఫీల్డ్ ఆఫీసర్ సునీల్ కుమార్, సి ఎఫ్ ఎల్ గార్ల కౌన్సిలర్లు బి. హరి ప్రసాద్, బి. భాస్కర్, అమర్నాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు బ్యాంకింగ్ సేవలు, పొదుపు ప్రాధాన్యత, బీమా పథకాలు, డిజిటల్ లావాదేవీలపై అవగాహన కల్పించారు.