రాత్రి వేళల్లో రైళ్లలో ఛార్జింగ్ బంద్
జాతీయం / Ntoday News: రైళ్లలో ప్రయాణికుల భద్రత, అగ్నిప్రమాదాల నివారణ కోసం రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. రాత్రి 11 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు మొబైల్, ల్యాప్టాప్ ఛార్జింగ్ పాయింట్లను తప్పనిసరిగా బంద్ చేయాలని అన్ని రైల్వే జోన్లకు కఠిన ఆదేశాలు జారీ చేసింది. 2014 నాటి ఉత్తర్వులను కచ్చితంగా అమలు చేయాలని, ఇందులో ఎలాంటి మినహాయిం పులూ ఇవ్వకూడదని బోర్డు స్పష్టం చేసింది. సౌత్ ఈస్టర్న్ రైల్వే (ఎస్ఈఆర్) పరిధిలోని ఒక రైలులో ఇటీవల ప్రయాణికుడి పవర్ బ్యాంక్ ఛార్జింగ్ పెట్టినప్పుడు అది పేలి పొగలు వచ్చాయి. ఆ సమయంలో విధుల్లో ఉన్న సిబ్బంది రాత్రి వేళల్లో ఛార్జింగ్ పాయింట్లను బంద్ చేయకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందని రైల్వే బోర్డు గుర్తించింది. అందుకే 2014 జూన్ నాటి నిబంధన లను కఠినంగా అమలు చేయాలని అక్టోబర్ 26న విడుదల చేసిన సర్క్యులర్లో స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వుల అమలు కోసం సంబంధిత సిబ్బందికి తగిన శిక్షణ ఇవ్వడంతో పాటు, ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని జోనల్ అధికారులకు ఆదేశాలు అందాయి. భద్రతా దృష్ట్యా ప్రయాణికులందరూ ఈ నిబంధనలకు సహకరించాలని రైల్వే శాఖ కోరింది.