ఎల్‌నినో కరువు ప్రభావంపై అవగాహనకు ఫ్లెక్సీ ప్రదర్శన
ఇంటికి ఇంకుడు గుంత.. పంటకు పంట కుంట.. ఊరికి ఊట కుంటపై ప్రచారం
నెల్లికుదురు, అక్టోబర్ 28 (ఎన్ టుడే న్యూస్): ఎల్‌నినో ప్రభావంతో ఎదురయ్యే కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో మండల ప్రజా పరిషత్ ఆధ్వర్యంలో నెల్లికుదురు మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్‌లో ఫ్లెక్సీ ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఎంపీడీవో సింగారపు కుమార్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు.
నీటి సంరక్షణపై ప్రజలకు అవగాహన
ఈ సందర్భంగా స్థానిక ఎంపీఓ వెంకటరమణ మాట్లాడుతూ.. వి.బి.జి. రాంజీ కార్యక్రమంలో భాగంగా ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు “ఇంటికి ఇంకుడు గుంత.. పంటకు పంట కుంట.. ఊరికి ఊట కుంట” అనే కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఫ్లెక్సీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
మండలంలోని అన్ని గ్రామాల్లో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు ఈ కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు నీటి సంరక్షణకు అవసరమైన చర్యలు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందించినట్లు పేర్కొన్నారు.
భూగర్భ జలాల పెంపునకు చర్యలు తీసుకోవాలి
ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంత నిర్మించుకొని వర్షపు నీటిని భూమిలోకి ఇంకేలా చేయడం ద్వారా భూగర్భ జలాలను పెంపొందించాలని వెంకటరమణ ప్రజలకు సూచించారు. నీటి వనరుల సంరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఏపీవో మాధవి, స్థానిక పంచాయతీ కార్యదర్శి దేవయ్య, మండల పరిషత్ సిబ్బంది మహేందర్, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.