Munugode : మునుగోడులో 18వ విడత ఉచిత కంటి వైద్య శిబిరం ప్రారంభం
- ఇప్పటివరకు 13,430 మందికి కంటి పరీక్షలు.. 2,859 మందికి ఆపరేషన్లు, 6,075 మందికి కళ్లద్దాల పంపిణీ
- కంటి చూపు ప్రతి ఒక్కరికీ ఎంతో ముఖ్యం: కోమటిరెడ్డి లక్ష్మి
- మీ బాధ్యత నాది.. ధైర్యంగా వెళ్లి కంటి పరీక్షలు చేయించుకోండి: ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి
మునుగోడు, నవంబర్ 1 (ఎన్ టుడే న్యూస్):
మునుగోడు నియోజకవర్గంలో పేదలు, వృద్ధులు కంటి సమస్యలతో ఇబ్బందులు పడకూడదనే లక్ష్యంతో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కంటి వైద్య శిబిరాలకు విశేష స్పందన లభిస్తోంది. ఈ క్రమంలో ఆదివారం మునుగోడు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఆవరణలో 18వ విడత ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఆయన సతీమణి, ఫౌండేషన్ చైర్‌పర్సన్ కోమటిరెడ్డి లక్ష్మి ప్రారంభించారు.
17 శిబిరాల్లో వేలాది మందికి సేవలు
తన తల్లి కోమటిరెడ్డి సుశీలమ్మ పేరు మీద ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ద్వారా నియోజకవర్గంలో ఇప్పటివరకు 17 ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహించారు. ఈ శిబిరాల ద్వారా 13,430 మందికి కంటి పరీక్షలు చేయించగా, 2,859 మందికి కంటి ఆపరేషన్లు పూర్తయ్యాయి. మరో 6,075 మందికి కళ్లద్దాలు పంపిణీ చేశారు.
18వ విడత శిబిరాన్ని ఎమ్మెల్యే దంపతులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం కోమటిరెడ్డి సుశీలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
వృద్ధులు, మహిళలతో ఆత్మీయ పలకరింపు
వైద్య శిబిరంలో ఏర్పాటు చేసిన నాలుగు కౌంటర్లలో కంటి పరీక్షలు చేయించుకుంటున్న వృద్ధులు, మహిళలను ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి దంపతులు ఆత్మీయంగా పలకరించారు. వైద్య శిబిరం నిర్వహణ తీరును పరిశీలించారు. కంటి ఆపరేషన్లకు ఎంపికైన వృద్ధులు, మహిళలకు ధైర్యం చెబుతూ, వారి వైద్య బాధ్యతను తాము చూసుకుంటామని భరోసా ఇచ్చారు.
కంటి చూపు ప్రతి ఒక్కరికీ ముఖ్యం: కోమటిరెడ్డి లక్ష్మి
ఈ సందర్భంగా కోమటిరెడ్డి లక్ష్మి మాట్లాడుతూ కంటి చూపు ప్రతి ఒక్కరికీ ఎంతో ముఖ్యమని అన్నారు. నియోజకవర్గంలో ఏ ఒక్కరూ కంటి సమస్యలతో బాధపడకూడదనే ఉద్దేశంతో మెరుగైన కంటి వైద్యం అందించడమే తమ ఫౌండేషన్ లక్ష్యమని తెలిపారు. శిబిరానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ భోజన సదుపాయం కల్పించి, అందరూ భోజనం చేశారా లేదా అని స్వయంగా పర్యవేక్షించారు.
ఒక్క రోజులో 623 మందికి కంటి పరీక్షలు
ఆదివారం నిర్వహించిన 18వ విడత శిబిరంలో మొత్తం 623 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వారిలో 228 మంది కంటి ఆపరేషన్లకు ఎంపికయ్యారు. వీరిలో 109 మందిని వెంటనే హైదరాబాద్‌లోని శంకరా కంటి ఆసుపత్రికి తరలించారు.
ఫీనిక్స్, శంకరా ఆసుపత్రి సహకారం
ఫీనిక్స్ ఫౌండేషన్, శంకరా కంటి ఆసుపత్రి సహకారంతో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఈ ఉచిత కంటి వైద్య శిబిరాలను నిర్వహిస్తోంది. పేదలు, వృద్ధులకు నాణ్యమైన కంటి వైద్యం అందించేందుకు ఈ కార్యక్రమాలను నిరంతరాయంగా కొనసాగిస్తున్నారు.